BAFTA 2023 లిస్ట్ లో RRR.. గంగూభాయి ఔట్!

Update: 2023-01-07 03:43 GMT
ఎన్టీఆర్-రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ RRR ఆస్కార్ రేసులో స్వ‌తంత్య్ర కేట‌గిరీలో పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు.. ఇటీవ‌ల ప్ర‌పంచ‌య‌వ‌నిక‌పై అవార్డుల ప‌రంగా బ్యాక్-టు-బ్యాక్ విజయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.

ప్ర‌స్తుతం అభిమానులంతా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాల్లో RRR రెండు నామినేషన్లను పొందింది. సాధారణంగా ఈ అవార్డుల విజేతలు చాలా సందర్భాలలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లను గెలుచుకుంటారు.

తాజా సమాచారం మేర‌కు ఈ చిత్రం బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (బాఫ్టా) లాంగ్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రం 'ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్' విభాగంలో స్థానం సంపాదించింది. విపరీతమైన పోటీ న‌డుమ ఆర్.ఆర్.ఆర్ కు ఇది అపురూపమైన అవ‌కాశం. ఇప్పుడు అవార్డుల‌ను కొల్ల‌గొడితే అది చిత్ర‌బృందంలో మ‌రింత ఉత్సాహం పెంచుతుంది. ప్రస్తుతం రెండో రౌండ్ ఓటింగ్ జరుగుతోంది జనవరి 19న నామినేషన్లను ప్రకటిస్తారు. అవార్డు ప్రదానోత్సవం ఫిబ్రవరి 19న జరగనుంది.

ఈ గంగూభాయికి ఏమైంది?

BAFTA లాంగ్ లిస్ట్ ను విడుదల చేయగా ఇందులో ఆలియా 'గంగూబాయి కతియావాడి' నామినేష‌న్ల‌లో క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. SS రాజమౌళి RRR ... షౌనక్ సేన్ డాక్యుమెంటరీ 'ఆల్ దట్ బ్రీత్స్' మాత్రమే వచ్చే నెలలో జరగనున్న BAFT ఫిల్మ్ అవార్డ్స్ లో లాంగ్ లిస్ట్ లో స్థానం సంపాదించిన భారతీయ సినిమాలుగా నిలిచాయి. గంగూబాయి కతియావాడి BAFTA లాంగ్ లిస్ట్ లో స్థానం సంపాదించ‌డంలో విఫలమైంది. అయితే RRR ఒక నామినేషన్ సాధించింది.

BAFTA ఫిల్మ్ అవార్డ్స్ 24 విభాగాలలో లాంగ్ లిస్ట్ లను వెల్లడించ‌గా జర్మన్ చిత్రం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ - ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్ వరుసగా 15- 14 లాంగ్ లిస్ట్ నోడ్ లతో టాప్ పొజిష‌న్ ని కైవ‌శం చేసుకున్నాయి. SS రాజమౌళి RRR చిత్రం నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం ఒక నామినేషన్ స్కోర్ చేసింది. షౌనక్ సేన్ ఆల్ దట్ బ్రీత్స్ డాక్యుమెంటరీ కూడా ప్రత్యేక కేట‌గిరీకి ఎంపికైంది. కానీ గత నెల రోజులుగా  BAFTAలో విప‌రీత‌మైన ప్రచారంలో ఉన్న సంజయ్ లీలా భ‌న్సాలీ పీరియాడికల్ డ్రామా గంగూబాయి కతియావాడికి ఎటువంటి నామినేషన్ రాక‌పోవ‌డం చిత్ర‌బృందాన్ని నిరాశ‌ప‌రిచింది. భ‌న్సాలీ లాంటి క‌ళాత్మ‌క ద‌ర్శ‌కుడి సినిమా రేసులో లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా.. క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ లో క‌ళాత్మ‌క సినిమాలు తీయ‌గ‌లిగే రాజ‌మౌళి రేసులో ముందుకు దూసుకెళ్లాడ‌ని చెప్పాలి.

వెరైటీలోని ఒక క‌థ‌నం ప్రకారం లాంగ్ లిస్ట్ లు డిసెంబర్ 30న ముగిసిన రౌండ్ 1 పీరియడ్ లోని ఓట్లపై ఆధారపడి ఎంపికైన‌వి. ఈ రోజు లాంగ్ లిస్ట్ లో పేరున్న వారు రౌండ్ 2కి చేరుకుంటారు. జనవరి 13తో ఈ అంకం ముగిసి తుది నామినేషన్లతో జాబితాలు వెలువ‌డ‌తాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 19న లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్ లో జరగనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News