బాలయ్య - వీరయ్య మధ్యలో నలిగిపోతున్న మైత్రీ..?

Update: 2022-10-14 09:48 GMT
2023 సంక్రాంతి బెర్తులు ఖరారు అవుతున్నాయి. క్రేజీ చిత్రాలన్నీ ఫెస్టివల్ సీజన్ ని లక్ష్యంగా చేసుకొని సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమాని జనవరి 12న విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ టీమ్ ప్రకటించింది.

అలానే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' చిత్రాన్ని వచ్చే పొంగల్ రేసులో నిలపనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #MEGA154 చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ పెద్ద పండక్కి రావాలని ఆలోచిస్తుండటం నిర్మాతలకు తలనొప్పిగా మారిందని టాక్ నడుస్తోంది.

దశాబ్దాలుగా బాక్సాఫీస్ ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరూ సంక్రాంతి బరిలో దిగితే చూడాలని సినీ అభిమానులు కోరుకుంటారు. ఈసారి కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఇద్దరు హీరోల నిర్మాతలు ఒక్కరే అవ్వడంతోనే సమస్య వచ్చిపడింది.

'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న చిరంజీవి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేసేలా థియేటర్ల అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK107 చిత్రాన్ని మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్నారు. 'అఖండ' సెంటిమెంట్ తో డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. నిర్మాతలు కూడా ఇదే ప్లాన్ తో జనవరిలో చిరంజీవి చిత్రాన్ని విడుదల చేయాలని భావించారట.

కానీ ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతికే రావాలని అనుకుంటున్నారట. అదే ఇప్పుడు నిర్మాతలకు తలనొప్పిగా మారిందని టాక్ వస్తోంది. ఒకే ప్రొడక్షన్ లో రూపొందుతున్న సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ చేయడం అనేది జరగని పని. అదే జరిగితే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది.

ఈ నేపథ్యంలో ఓవైపు బాలయ్యను ఒప్పించి డిసెంబర్ కే పరిమితం చేయలేక.. మరోవైపు సంక్రాంతి కంటే కాస్త ముందుగానే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని చిరంజీవి తో మాట్లాడలేక నిర్మాత‌లు టెన్ష‌న్‌ పడుతున్నారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఫైనల్ గా ఇద్దరిలో ఎవరు సంక్రాంతి బరిలో దిగుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News