కుప్ప‌నూర్చావా.. కోత కోశావా బాల‌య్యా?

Update: 2019-01-06 14:19 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అన్న‌య్య హ‌రికృష్ణ‌తో ఉన్న అనుబంధం ఎలాంటిది? అంటే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధానికి ప్ర‌తీక‌గానే `ఎన్టీఆర్ - క‌థానాయ‌కుడు`లో ఆ పాత్ర‌ను సృజించార‌ట. త‌న తండ్రి గారైన నంద‌మూరి తార‌క‌రామారావుకు కుడిభుజంగా నిలిచి రాజ‌కీయాల్లో అన్న‌గారి వెంట నిలిచి, యాత్ర‌ల్లో చైత‌న్య ర‌థ‌సార‌థిగా బృహ‌త్త‌ర‌మైన బాధ్య‌త‌ను నెర‌వేర్చిన హ‌రికృష్ణ పాత్ర లేనిదే అస‌లు ఆ సినిమా అసంపూర్ణం అనడంలో సందేహం లేదు.

అందుకే ఆ పాత్ర కోసం హ‌రికృష్ణ వార‌సుడు క‌ళ్యాణ్ రామ్ ని ఎంపిక చేసుకుని ఎంతో జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కించారు బాల‌య్య‌- క్రిష్ బృందం. ఎట్ట‌కేల‌కు క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న రిలీజ‌వుతోంది. ఈ చిత్రంలో హ‌రికృష్ణ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఎలా న‌టించారు? అన్న ఉత్కంఠ అనంద‌మూరి అభిమానుల్లో నెల‌కొంది. అయితే ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు హ‌రికృష్ణ పాత్ర ఎంత‌వ‌ర‌కూ సాగింది? అన్న‌ది ఈ చిత్రంలో చూపిస్తారు. అయినా తేదేపా శ్రేణుల్లో హ‌రికృష్ణ స‌న్నిహితులు స‌హా ద‌గ్గుబాటి కుటుంబంలోనూ ఆ పాత్ర‌కు సంబంధించిన ఎగ్జ‌యిట్‌ మెంట్ నెల‌కొంది.

ఇక‌పోతే అన్న‌య్య‌తో త‌న అనుబంధం గురించి బాల‌య్య బాబు ఓ ఇంట‌ర్వ్యూలో చెబుతూ-``ఓసారి ఊరెళ్లాను. అక్క‌డ పొలానికి వెళితే.. అప్పుడే పొలంలోంచి పంచెక‌ట్టుతో బ‌య‌టికి వ‌చ్చాడు అన్న‌య్య‌. చేత క‌ర్ర‌ప‌ట్టుకుని, త‌ల‌పాగా చుట్టుకుని రైత‌న్న‌లా గంభీరంగా క‌నిపించాడు. కుశ‌ల స‌మాచారం త‌ర్వాత నేను అడిగిన ప్ర‌శ్న‌కు న‌న్ను ఇంటివ‌ర‌కూ త‌రిమి కొట్టాడు. పెద్ద క‌ర్ర‌ప‌ట్టుకుని బాదుతూ త‌రిమాడు.. చిన్న‌ప్ప‌టి నుంచి అన్న‌య్య అంటే నాకే కాదు అంద‌రికీ భ‌యం. నాన్న‌గారి త‌ర్వాత అంత‌టి గౌర‌వం అందుకున్నారాయ‌న‌. చాలా విష‌యాల్లో మొర‌టోడు మా అన్న‌య్య‌..ఏదైనా అనుకుంటే వ‌దిలిపెట్టేవాడు కాడు`` అంటూ జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు. అయితే త‌న‌ని అలా క‌ర్ర ప‌ట్టుకుని బాదుకుంటూ ఇంటివ‌ర‌కూ ఎందుకు త‌రిమారు? అంటే.. మ‌న పొలం ఎలా ఉంది? అని ప్ర‌శ్నించ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ట‌. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేది నువ్వు, నేను.. వీడు మ‌న పొలం అంటాడేంటి?  కుప్ప‌నూర్చాడా?  కోత‌ కోశాడా?  అంటూ బాల‌య్య‌ను త‌రిమాడ‌ట హ‌రికృష్ణ‌. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఇంట్రెస్టింగ్ టాస్క్ క‌దూ? ఆ సీన్ తెర‌పైనా అంతే బాగా న‌వ్వులు పండించి ఉంటుందేమో!  చూడాలి.




Full View
Tags:    

Similar News