12 రోజుల షూటింగ్.. 8 కోట్ల ఖర్చు

Update: 2016-05-25 09:36 GMT
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఇది బాలయ్యకు వందో సినిమా కావడంతో ఏ రకంగానూ రాజీ పడుతున్నట్లు లేడు దర్శక నిర్మాత క్రిష్. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ ఫుల్ రన్ వసూళ్లు రూ.40 కోట్లే. ఐతే దాని మీద ఇంకో రూ.20 కోట్లు ఎక్కువే పెట్టి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని సొంతంగా నిర్మించే సాహసం చేయడం గొప్ప విషయమే. బాలయ్య వందో సినిమా కాబట్టి ఆటోమేటిగ్గా హైప్ ఎక్కువే ఉంటుంది. దీనికి తోడు ఆరంభం నుంచి సినిమాను వార్తల్లో నిలబెడుతూ.. బాలీవుడ్ నటీనటుల్ని సినిమాలో భాగం చేస్తూ ‘శాతకర్ణి’ మార్కెట్ పరిధిని పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు క్రిష్.

ఇంతకీ సినిమాకు రూ.60 కోట్ల బడ్జెట్ ఎందుకవుతోందని ఎవరికైనా సందేహాలుంటే.. ఇటీవలే మొరాకోలో ముగిసిన తొలి షెడ్యూల్ సంగతులు తెలిస్తే అవన్నీ తీరిపోతాయి. ఇక్కడ షూటింగ్ చేసింది కేవలం 12 రోజులేనట. మూడు వారాల పాటు అక్కడున్నప్పటికీ షూటింగ్ చేసింది మాత్రం అటు ఇటుగా సగం రోజులే. ఈ మాత్రానికే రూ.8 కోట్లు ఖర్చు పెట్టేయడం విశేషం. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు.. వందల సంఖ్యలో గుర్రాలు.. ఒంటెలు.. ఇతర జంతువులు.. టాప్ లెవెల్ టెక్నీషియన్లు.. భారీగా యుద్ధ సామగ్రి.. లొకేషన్ అద్దెలు.. ప్రయాణ ఖర్చులు.. భోజన వసతి సదుపాయాలు.. ఇన్నింటితో ముడిపడ్డ ఎపిసోడ్ కాబట్టి అంత ఖర్చుకావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కేవలం 12 రోజులకే 8 కోట్లంటే.. చారిత్రక సినిమా కాబట్టి కనీసం వంద రోజుల వర్కింగ్ డేస్ అయినా ఉంటాయి. ఇంకా పారితోషకాలు.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు.. గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్.. మొత్తంగా ఖర్చు చూస్తే భారీగానే ఉండేట్లుంది. సినిమా పూర్తయ్యేసరికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్టే అయ్యేలా ఉంది.
Tags:    

Similar News