బాలయ్యకు ఈ శాపమేంటో?

Update: 2018-05-01 01:30 GMT
నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కించడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించాడు. ఇందుకోసం రెండేళ్ల కిందట్నుంచే సన్నాహాలు చేసుకున్నాడు. ఎంతో పరిశోధన జరిపాడు. చాలామంది దర్శకుల పేర్లు పరిశీలించి చివరికి తేజను ఫైనలైజ్ చేశాడు. అంగరంగ వైభవంగా చిత్ర ప్రారంభోత్సవం జరిపాడు. ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ కూడా కలిగింది జనాల్లో. అంతా బాగుందని అనుకుంటుంటే చివరికి తేజ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఈ సినిమాపై ఒక్కసారిగా జనాల్లో నెగెటివిటీ వచ్చేసింది. తేజ స్థానంలో దర్శకుడిగా ఎవరిని ఎంచుకుంటాడా అని చూస్తే.. చివరికి బాలయ్యే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలొస్తున్నాయి. దర్శకుడిగా బాలయ్య సత్తాపై ఎవరికీ అంత గురి లేదు. అతడికి అందులో అనుభవం కూడా లేదు.

బాలయ్య దర్శకత్వం అనగానే ‘యన్.టి.ఆర్’ సినిమాపై ఆసక్తి తగ్గిపోయిన మాట వాస్తవం. వేరే సినిమా అయినా సరే కానీ.. బయోపిక్ తీయడం అన్నది అంత సులువైన వ్యవహారం కాదు. దీనికి ఎంతో నేర్పు కావాలి. అది బాలయ్య దగ్గర ఉందా అన్నది సందేహం. బాలయ్య స్వయంగా సినిమా నిర్మించాలని అనుకున్న ప్రతిసారీ ఆయనకు కలిసి రావట్లేదు. నాలుగేళ్లుగా సినీ రంగంలో ఉన్న బాలయ్యకు గతంలో ఒకసారి సొంత ప్రొడక్షన్లో సినిమా చేయాలనిపించింది. అదే ‘నర్తనశాల’. ఆ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ సౌందర్య మరణంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి సొంత ప్రొడక్షన్లో ‘యన్.టి.ఆర్’ చేయాలనుకుంటే దానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అసలు ఈ చిత్ర షూటింగ్ సజావుగా సాగుతుందా.. పూర్తవుతుందా.. అనుకున్నంత బాగా సినిమా వస్తుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. మరి బాలయ్య ఏం చేస్తాడో చూడాలి.


Tags:    

Similar News