ఓన్లీ హిందూపురం.. ఓన్లీ సినిమాలు

Update: 2017-09-07 06:26 GMT
తెలుగు తెర అగ్రనటుడు నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా రాజకీయాలను అస్సలు వదిలిపెట్టేవారు కాదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రజాసేవ చేసేవారు. కానీ రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఊహించని పరిణామాలు ఆకాశం ఎత్తున దేవుడిని కూడా నేలకు కూల్చగలవు.

ఎన్టీఆర్ మొదట హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తర్వాత  ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ క్రియాశీలకంగా మారి హిందూపురం స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు హిందూపురం అడ్డాలో టీడీపీదే అగ్రస్థానం. అయితే బాలయ్య ఎక్కడ మాట్లాడిన తనకి హిందూపురం అన్నా అక్కడి ప్రజాలన్నా ఎంతో ఇష్టమని వారికి చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని చెబుతుంటారు. అలాగే తనకు మంత్రి - ముఖ్యమంత్రి వంటి అగ్ర స్థానాలను ఏలాలని కోరిక లేదని.. కేవలం హిందూపురం ప్రజలకు కావాల్సినవి సమకూర్చడం తన బాధ్యత అన్నారు.  ఎప్పుడూ సినిమాల్లోనే ఉంటానని కూడా సెలవిచ్చారు.

ఇప్పటికే హిందూపురం నియోజకవర్గ ప్రజలు బాలయ్య పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వేళ.. నేనింకా సినిమాల్లోనే ఉంటాను అనే కామెంట్లు అక్కడివారికి రుచించట్లేదట. బాలయ్య ప్రజాసేవ కంటే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన సినిమాలను అస్సలు వదిలిపెట్టనని ఇక్కడ చాలా మంది శ్రమజీవులు ఉన్నారని చెబుతూ.. వారి జీవనోపాధి కోసం కూడా సినిమాలు చేస్తున్నానని చెప్పారు. కాని అసలు ఈ మాత్రం సినిమాలు చేస్తుంటేనే హిందూపురం కు ఏమీ చేయట్లేదనే క్రిటిసిజం వినిపిస్తుంటే.. ఇక సినిమాల్లోనే కొనసాగుతాను అంటే.. అక్కడి అభివృద్ది పనులను గాలికి వదిలేసినట్టేనా? పైగా ఫోనుల్లోనే పనులు చేసేస్తుంటా అని మొన్నామధ్యన ఇంటర్యూల్లో చెప్పారు బాలయ్య. అంటే వ్యక్తిగతంగా అక్కడ కనిపించకుండా పనులు కానిస్తున్నారనమాట. అలాంటప్పుడు ఆ పనుల్లో పారదర్శకత ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఎమ్మెల్యే అంటే నియోజకవరంలో ప్రత్యక్షంగా ఉండి పనిచేయాల్సిన చేయించాల్సిన అవసరం ఉంది కూడా అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

ఏదేమైనా కూడా.. నందమూరి వారసుడిగా బాలయ్య రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారని అనుకుంటే.. కేవలం హిందూపురానికే పరిమితం అయ్యి.. సినిమాల్లోనే ఉంటాను అనడం నందమూరి ఫ్యాన్సుకు కూడా షాకింగ్ గానే ఉంది. ఇక సినిమాల్లోనే ఉంటూ మన హిందూపురాన్ని మరింత నిర్లక్ష్యం చేస్తారేమోనని అక్కడి నియోజకవర్గపు ప్రజలు కూడా కంగారుపడుతున్నారు. అది సంగతి.
Tags:    

Similar News