దాసరి పడుకుంటే ఎన్టీఆర్ లేచేవారు

Update: 2018-05-05 08:24 GMT
మహానటుడు నందమూరి తారక రామారావుకు.. దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘బెబ్బులి పులి’.. ‘సర్దార్ పాపారాయుడు’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్లు వచ్చాయి. వ్యక్తిగతంగా కూడా వీళ్లిద్దరికీ గొప్ప అనుబంధం ఉండేది. దాసరి జయంతి నేపథ్యంలో ఫిలిం ఛాంబర్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మురళీ మోహన్ ఆ ఇద్దరి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. చెన్నైలో ఎన్టీఆర్.. దాసరిల ఇల్లు ఒకే వీధిలో దగ్గర దగ్గరగా ఉండేవని.. వీళ్లిద్దరూ వేర్వేరు సమయాల్లో నిద్రకు ఉపక్రమించేవారని.. ఈ విషయమై ఎన్టీఆర్ ఒక జోక్ వేశారని మురళీ మోహన్ అన్నారు. దాసరి రాత్రి 2-3 గంటల వరకు మేలుకుని తర్వాత పడుకునేవారని.. ఎన్టీఆర్ 3 గంటలకే నిద్ర లేచేవారని.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తమ వీధిలో గూర్ఖా అవసరమే లేదని ఎన్టీఆర్ చమత్కరించేవారని మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు.

మరోవైపు బాలయ్య మాట్లాడుతూ.. తనను ‘శివరంజని’ సినిమాలో హీరోగా నటింపజేయాలని దాసరి తన తండ్రిని కలిస్తే.. అప్పటికి తాను చదువుకుంటుండటంతో వద్దన్నారని.. చదువు పూర్తయ్యాక చేద్దామని చెప్పారని అన్నాడు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో దాసరితో పని చేయాలని అనుకున్నా కుదరలేదని.. చివరికి ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం దక్కిందని అన్నాడు. దాసరి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి సమస్యను తన ఇంట్లో సమస్యగా భావించేవారని.. అలాంటి వాళ్ల అవసరం ఇప్పుడు పరిశ్రమకు ఉందని అభిప్రాయపడ్డాడు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ దాసరి దర్శకుడు కావడానికంటే ముందే తనకు పరిచయమని.. తన సినిమాలకు మాటలు రాశారని.. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో తాను నటించానని అన్నారు. తనకు ఇష్టం లేకపోయినా దర్శకుడిగా దాసరి తొలి సినిమా ‘తాతా మనవళ్ళు’లో నటింపజేశారని.. ఆ సినిమా చేయకపోయి ఉంటే ఒక గొప్ప పాత్ర మిస్సయ్యేదాన్నని విజయనిర్మల అన్నారు.
Tags:    

Similar News