మాట నెగ్గించుకుని మేక‌ర్స్ ని ఇరుకున పెట్టిన బాల‌య్య!

Update: 2022-10-22 11:30 GMT
నంద‌మూరి బాల‌కృష్ణ మొత్తానికి త‌న పంతం నెగ్గించుకున్నారు. డిసెంబ‌ర్ సెంటిమెంట్ ప్ర‌కారం త‌న తాజా చిత్రం విడుద‌ల‌వుతుంద‌ని అంతా భావించారు కానీ ఊహించని విధంగా బాల‌కృష్ణ న‌టిస్తున్న `వీర సింహారెడ్డి` సంక్రాంతికి బ‌రిలో దిగుతున్న‌ట్టుగా తేలిపోవ‌డంతో బాల‌య్య అభిమానులు సంబ‌రాలు చేసుకుంటుంటే మేక‌ర్స్ మాత్రం ఇబ్బందిక‌రంగా ఫీల‌వుతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. నంద‌మూరి బాల‌కృష్ణ డిసెంబ‌ర్ 2న విడుద‌లై `అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

ఈ మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. అదే జోష్ తో గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్నారు. ఈ మూవీని ప్రారంభం నుంచి బాల‌య్య‌కు హిట్ ని అందించి సెంటిమెంట్ నెల‌గా మారిన డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాల‌య్య మాత్రం సంక్రాంతికే రావాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ని, కానీ మేక‌ర్స్ మాత్రం డిసెంబ‌ర్ లోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

ఈ వార్త‌ల నేప‌థ్యంలో శుక్ర‌వారం టైటిల్ అనౌన్స్ మెంట్ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తించింది. బాల‌య్య ఫ్యాన్స్ ఊహించిన‌ట్టుగానే ఈ మూవీకి `వీర సింమారెడ్డి` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేసిన మేక‌ర్స్ ఈ మూవీని బాల‌య్య ప‌ట్టు మేర‌కు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్ర‌క‌టించారు. ఇదే ఇప్ప‌డు మైత్రీ మూవీ మేక‌ర్స్ వారికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింద‌ని తెలుస్తోంది.

ఇదే నిర్మాణ సంస్థ మెగాస్టార్ చిరంజీవి - బాబిల కాంబినేష‌న్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా `వాల్తేరు వీర‌య్య‌`ని నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ.. చిరుకు సోద‌రుడిగా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా  కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీని మేక‌ర్స్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ ప్ర‌క‌టించింది. ఈ సినిమాతో బాల‌య్య‌తో చేస్తున్న `వీర సింహారెడ్డి` సంక్రాంతికి రిలీజ్ చేస్తే క్లాష్ అవుతుంద‌ని భావించిన మేక‌ర్స్ ఈ మూవీని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు.

కానీ బాల‌కృష్ణ సంక్రాంతికే వ‌స్తానంటే బెట్టుచేయ‌డంతో చివ‌రికి ఏమీ చేయ‌లేక బాల‌య్య మాట‌కు సై అన‌క త‌ప్ప‌లేదు. అయితే ఇదే మైత్రీ వారిని ఇర‌కాటంలో ప‌డేసి ఇబ్బందికి గురిచేయ‌డం ఖాయం అని చెబుతున్నారు. గ‌తంలో చిరంజీవి, బాల‌కృష్ణ సంక్రాంతి బ‌రిలో పోటీప‌డిన సంద‌ర్భాలు వున్నాయి. అయితే ఒకే సంస్థ నిర్మించిన సినిమాల‌తో పోటీప‌డ‌టం మాత్రం ఇదే తొలిసారి. ప్ర‌మోష‌న్స్ ద‌గ్గ‌రి నుంచి మెయిన్ థియేట‌ర్స్ ని కేటాయించే వ‌ర‌కు మైత్రీ వారికి ఈ రెండు సినిమాలు పెద్ద చిక్కునే తెచ్చిపెట్టాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇక బాల‌య్య టైటిల్ తో పాటు రిలీజ్ టైమ్ పై కూడా క్లారిటీ ఇవ్వ‌డంతో మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న సినిమా టైటిల్ తో పాటు టీజ‌ర్ ని కూడా దీవావ‌ళికి రిలీజ్ చేసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. టీజ‌ర్ లో ఈ సారి ప‌క్కాగా రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. దిలా వుంటే ఈ రెండు సినిమాల‌తో పాటు వ‌చ్చే సంక్రాంతికి ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`, విజ‌య్ `వార‌సుడు`, అజిత్ `తునీవు` కూడా పోటీప‌డ‌బోతున్నాయి. వీట‌న్నింటికి థియేట‌ర్స్ కేటాయించ‌డం ఒకెత్త‌యితే మైత్రీ వారు చిరు, బాల‌య్య సినిమాలకు థియేట‌ర్స్ ని కేటాయించ‌డం ఒకెత్తుగా మారనుంద‌ని.. బాల‌య్య కార‌ణంగా ఇర‌కున ప‌డ్డ మైత్రీ వారు ఈ టాస్క్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తార‌న్న‌ది వేచి చూడాల్సిందే.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News