బాలయ్య వేరే సినిమాలు చూస్తున్నారట

Update: 2018-01-09 04:58 GMT
తాను తన తండ్రి నందమూరి తారక రామారావు సినిమాలు.. తన సినిమాలు తప్పే వేరే వాళ్ల సినిమాలేవీ చూడని.. బాలకృష్ణ చాలాసార్లు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. దక్షిణాదిన అగ్ర హీరోల్లో ఒకడిగా కొనసాగుతూ వేరే సినిమాలు చూడకపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అందరి సినిమాలూ చూస్తేనే కదా ట్రెండ్ ఏంటో.. కొత్తగా వస్తున్న మార్పులు చేర్పులేంటో తెలిసేది? కానీ బాలయ్య మాత్రం తన తండ్రి ఎప్పుడో చేసిన సినిమాలు చూసినా తాను ఎంతో నేర్చుకుంటానని.. ఒక పాత్ర చేయడానికి అవసరమైన స్ఫూర్తి తనకు ఆయన్నుంచే వస్తుందని అంటుంటాడు. ప్రతి రోజూ రాత్రి ఆయన సినిమాలో ఒక సన్నివేశమైనా చూశాకే తాను నిద్ర పోతానని అంటుంటారు.

ఐతే బాలయ్యలో ఈ మధ్య కొంచెం మార్పు వచ్చినట్లుంది. తెలుగులోనే వేరే వాళ్ల సినిమాలు చూడను అనే బాలయ్య.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ సినిమాలో అనేక భాషలకు చెందిన సినిమాలు చూస్తున్నారట. కొత్తగా బాలయ్యలో ఈ మార్పు రావడానికి కారణం.. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించబోతుండటమే. ఈ సినిమా కోసమే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ బయోపిక్స్ చూస్తున్నానని.. కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని.. ఎన్టీఆర్ బయోపిక్‌ ను గొప్పగా తీయాలనే సంకల్పంలో ఇది భాగమని బాలయ్య చెప్పారు. అంతే కాక తన వీడియో లైబ్రరీలో తన తండ్రి సినిమాలతో పాటు కొంత మేర ఏఎన్నార్ సినిమాలు కూడా ఉంటాయని.. అప్పుడప్పుడూ అవి కూడా చూస్తుంటానని బాలయ్య చెప్పడం విశేషం.
Tags:    

Similar News