బాలకృష్ణుడు.. ఆ రోజు వచ్చేస్తాడు

Update: 2017-11-02 11:15 GMT
ఈ ఏడాది ఇప్పటికే ‘శమంతకమణి’.. ‘కథలో రాజకుమారి’ సినిమాలతో పలకరించాడు నారా రోహిత్. ఐతే అవి రెండూ రోహిత్ కు నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘బాలకృష్ణుడు’ మీదే ఉన్నాయి. గత నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ కూడా ఖాయం చేసుకున్నారు. నవంబరు నెలాఖర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 24వ తేదీకి బెర్తు కన్ఫమ్ చేసుకున్నారు. ఈ నెల తొలి మూడు వారాల్లో చాలా సినిమాలొస్తున్నాయి. దాదాపు పది సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి.

దీంతో రిస్క్ లేకుండా నెలాఖర్లో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు రోహిత్. ఐతే ఆ తేదీకి కూడా పోటీ ఉండే అవకాశాలు లేకపోలేదు. ఒకట్రెండు చిన్న సినిమాలు నవంబరు 24 మీద దృష్టి పెట్టాయి. ఇక ‘బాలకృష్ణుడు’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. నారా రోహిత్ సరసన రెజీనా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఇందులో మాస్ లక్షణాలున్న క్యారెక్టర్ చేశాడు రోహిత్. ఈ సినిమాకు తనకు మంచి కమర్షియల్ సక్సెస్ అందిస్తుందని రోహిత్ ఆశిస్తున్నాడు. మరోవైపు రోహిత్ ‘వీర భోగ వసంత రాయలు’ అనే సినిమాతో పాటు ‘బాణం’ దర్శకుడితోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ‘ఆటగాళ్ళు’ అనే సినిమాను కూడా రోహిత్ మొదలుపెట్టాడు.
Tags:    

Similar News