అభిమానులకు బాలయ్య బహిరంగ లేఖ..!

Update: 2021-06-07 11:30 GMT
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది పుట్టినరోజు సందర్బంగా తన అభిమానులకు ముందుగానే బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి తెలియజేసారు. జూన్ 10న బాలయ్య 61వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో అభిమానులు నేరుగా వచ్చి తనను కలిసే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేసారు. ప్రతి ఏడాది నా పుట్టినరోజును పండగలా జరుపుతున్న అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు. స్నేహితులు - శ్రేయోభిలాషులు - కుటుంబసభ్యులు మీతో పుట్టినరోజు వేడుకలు చేసుకోనే అదృష్టానికి అంతరాయం కలగడం చాలా భాధాకరంగా ఉందన్నారు. ఈ కరోనా మహామ్మారి ప్రభావం చూపుతున్న ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ క్షేమమే నాకు ఆశీర్వాదం అన్నారు.

కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు అభిమానులతో పాటు అందరు విధిగా పాటించాలని.. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం ముఖ్యమని అన్నారు బాలయ్య. అందుకే అందరినీ కలవాలన్న ఆలోచనను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దయచేసి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నన్ను కలవడానికి రావద్దొని కోరుతున్నాను. నిండు మనసుతో నా విన్నపాన్ని మన్నించండి అంటూ బాలయ్య అభిమానులను కోరారు. తాజాగా ఆయన బహిరంగ లేఖలో ఈ విధంగా విజ్ఞప్తి చేశారు.

"నా ప్రాణ సమానులైన అభిమానులకు.. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ.. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ.. మీ నందమూరి బాలకృష్ణ" అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.
Tags:    

Similar News