మెగాస్టార్ కోసం ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ లైన్ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్!

తమ కెరీర్ లో ఒక్కసారైనా ఆయన్ని డైరెక్ట్ చేయాలని డ్రీమ్ గా పెట్టుకున్న డైరెక్టర్స్ ఉన్నారు.

Update: 2025-01-04 03:36 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడు కోరుకుంటాడు. తమ కెరీర్ లో ఒక్కసారైనా ఆయన్ని డైరెక్ట్ చేయాలని డ్రీమ్ గా పెట్టుకున్న డైరెక్టర్స్ ఉన్నారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలలో వర్క్ చేసిన అనిల్.. ఇప్పుడు చిరుతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు.

ఇటీవల కాలంలో న్యూ జనరేషన్ ఫిలిం మేకర్స్ తో వర్క్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న చిరంజీవి.. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ మధ్యనే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని కంటే ముందే అనిల్ రావిపూడితో చిరు ఓ మూవీ చేస్తారని తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. రీసెంట్ గా అనిల్ మీడియాతో మాట్లాడుతూ చిరుతో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. లేటెస్టుగా దర్శకుడు మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెగాస్టార్ తో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు ఆ దశకు వచ్చిందని చెప్పారు. అయితే ఇంకా ప్రాసెస్ లోనే ఉందని అన్నారు.

చిరంజీవితో ఒకటి రెండూ మీటింగ్స్ జరిగాయని చెప్పిన అనిల్ రావిపూడి.. ఎక్స్ట్రార్డినరీ స్టోరీ లైన్, బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకున్నామని తెలిపారు. వర్కింగ్ స్పేస్ లో వుంది కాబట్టి ఎలాంటి మ్యాజిక్ చేయాలనేది ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. అంతా సెట్ అయి అఫిషియల్ గా ముందుకి వచ్చిన రోజున అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే మనకందిన సమాచారం ప్రకారం అనిల్ - సాహు శుక్రవారం చిరంజీవిని కలిసి మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు కనుక, 'విశ్వంభర' తరువాత చిరంజీవి చెయ్యబోయే సినిమా అనిల్ కాంబినేషన్ లోనే అని టాక్ వినిపిస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజైన తర్వాత అనిల్ ఈ మెగా ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. లేటెస్టుగా దర్శక నిర్మాతలు చిరుని మీట్ అవ్వడంతో, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో అనే చర్చలు జరుగుతున్నాయి.

ఇకపోతే చిరంజీవితో సినిమా చేయడానికి లైన్ లో ఉన్న దర్శకులలో బాబీ కొల్లి, బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. 'డాకు మహారాజ్' సినిమా విడుదలైన తర్వాత చిరుం కోసం బాబీ ఓ స్క్రిప్టు రెడీ చేస్తారని టాక్ నడుస్తోంది. అలానే చాన్నాళ్ళ నుంచి బోయపాటితో మెగాస్టార్ సినిమా అనుకుంటున్నారు. 'అఖండ 2: తాండవం' మూవీ తరువాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దర్శక రచయిత బీవీఎస్ రవి కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News