మగాడిలో పోరాడుతున్నా..కష్టాలను జయిస్తా! మాధవీలత
అక్కడ గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని, మహిళలపై అక్కడ దాడి జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ఆమె ప్రశ్నించారు.
నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తాడిపత్రి జేసీ పార్క్ మహిళల ఈవెంట్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప దమైన సంగతి తెలిసిందే. అక్కడ గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని, మహిళలపై అక్కడ దాడి జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ఆమె ప్రశ్నించారు. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. పరుష పదజాలంతో మాధవీలతపై కామెంట్లు చేసారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ ఆయనే బహిరంగ క్షమాపణలు కోరారు. అవేశంలో అన్నానని, అలా మాట్లాడటం తప్పని వెనక్కి తగ్గారు.
తాజాగా మాధవీలత కన్నీటి పర్యంతం అవుతూ పేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. తాను అలా ఏడవడానికి గల కారణాన్ని చెప్పే ప్రయత్నం చేసారు. `చాలా ప్రయత్నం చేసా. కానీ నేను మనిషినే. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతీ క్షణం వేదనతో నిండి ఉంది కోపం, నిరాశ, ఆవేదన, దుఖం అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మ విశ్వాసాన్ని చిదిమేయాలాని ప్రయత్నించారు.
పదే పడే ఇవే మాటలన్నారు. నా పార్టీ కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. నేను ఎక్కడా రూపాయి తీసుకుంది లేదు. ఎవరికీ ద్రోహం చేసింది లేదు. మోసం చేసింది లేదు. కానీ కక్షగట్టి మాటలంటున్నారు. ఆడపిల్లగా ఎన్నడూ సింపతీ గేమ్ ఆడలేదు. మహిళా చట్టాలను అనుకూలంగానూ ఉపయోగించలేదు. మగాడిలా పోరాటం చేస్తున్నాను. కష్టాలను అధిగమిస్తాను. నా దైర్యాన్ని కోల్పోను.
నాకు సోషల్ మీడియాలో ఎంతో మంది శ్రేయోభిలాషులున్నారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానం, అశీర్వాదాలు నాకు శక్తినిస్తాయి` అని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ కొందరు మద్దతుగానూ నిలుస్తున్నారు.