డాకు మహారాజ్‌తో దబిడి దిబిడికి రూ.2 కోట్లు..!

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా నటించిన ఆ పాటపై కొందరు విమర్శలు చేస్తూ ఉంటే కొందరు పాట బాగుంది, మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.

Update: 2025-01-07 17:30 GMT

సంక్రాంతి కానుకగా రాబోతున్న బాలకృష్ణ 'డాకు మహారాజ్‌' సినిమా నుంచి తాజాగా దబిడి దిబిడి పాట వచ్చింది. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా నటించిన ఆ పాటపై కొందరు విమర్శలు చేస్తూ ఉంటే కొందరు పాట బాగుంది, మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఊర్వశి పిరుదులపై బాలకృష్ణ కొడుతూ చేసిన స్టెప్పులను చాలా మంది తప్పుబడుతున్నారు. ఇదెక్కడి డాన్స్ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాటను విమర్శిస్తూనే చాలా మంది చూస్తున్నారు. దాంతో ఇప్పటికే భారీ ఎత్తున వ్యూస్‌ లభించాయి. వివాదం కావడంతో అసలు మ్యాటర్‌ ఏంటో తెలుసుకునే ఉద్దేశ్యంతో చాలా మంది పాటను చూస్తున్నట్లుగా ఉన్నారు.

డాకు మహారాజ్ సినిమాలో కేవలం ఐటెం సాంగ్‌కి పరిమితం కాకుండా ఊర్వశి రౌతేలా కీలక పాత్రలోనూ కనిపించబోతుందని సమాచారం అందుతోంది. అందుకే ఈ సినిమాకు గాను ఆమె ఏకంగా రూ.2 కోట్ల పారితోషికంను అందుకుందని అంటున్నారు. ఈమధ్య కాలంలో పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌ను చేసినందుకు గాను శ్రీలీల ఏకంగా రూ.2 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఊర్వశి రౌతేలా సైతం దాదాపు అంతే పారితోషికం అందుకుంది. అయితే డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా కేవలం పాటలో మాత్రమే కాకుండా కొన్ని సన్నివేశాల్లోనూ కనిపించబోతుంది. బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్యలోనూ ఐటెం సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. కనుక దబిడి దిబిడి ఐటెం సాంగ్‌తో డాకు మహారాజ్‌కి మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

బాలకృష్ణ డ్యూయెల్‌ రోల్‌లో కనిపించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటించింది. కీలక పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలు నందమూరి అభిమానులకు కన్నుల పండుగ అన్నట్లు ఉంటాయని ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుంది. బాలకృష్ణ బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమాతో డబుల్‌ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాబీ సినిమాలో ఫ్యాన్స్‌ బాలకృష్ణను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది.

ఈ సంక్రాంతికి రాబోతున్న రామ్‌ చరణ్ గేమ్‌ ఛేంజర్‌, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల పోటీని డాకు మహారాజ్‌ సినిమా ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌ కచ్చితంగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండబోతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జోరు మీదున్న బాలకృష్ణకు డాకు మహారాజ్ సినిమా మరో విజయాన్ని కట్టబెట్టేనా చూడాలి. బాలకృష్ణ మరో వైపు అఖండ 2 సినిమాలోనూ నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందబోతున్న ఆ సినిమాను ఇదే ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకలు ముందుకు తీసుకురాబోతున్నారు.

Tags:    

Similar News