RRR కంటే డబుల్ వసూల్.. `గేమ్ ఛేంజర్`పై సల్మాన్ అంచనా..
చరణ్- కియరా అద్వాణీ జంట తాజాగా హిందీ బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమైంది.
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` ఈ సంక్రాంతి కానుకగా అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హిందీ బెల్ట్ నుంచి భారీగా వసూలు చేయడమే లక్ష్యంగా `గేమ్ ఛేంజర్`ని ఉత్తరాదినా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ తన సినిమాని వీలున్న అన్ని వేదికలపైనా ప్రచారం చేస్తున్నాడు. చరణ్- కియరా అద్వాణీ జంట తాజాగా హిందీ బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమైంది. షో హోస్ట్ అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. సల్మాన్‌తో వారి ఇంటరాక్షన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ తో సంభాషణల సమయంలో చరణ్ మాట్లాడుతూ.. RRR తర్వాత గడిచిన 5 సంవత్సరాలలో గేమ్ ఛేంజర్ తన మొదటి సోలో రిలీజ్ అవుతుందని చరణ్ చెప్పాడు. `గేమ్ ఛేంజర్` RRR ఫుల్ రన్ కలెక్షన్‌కి రెండింతలు వసూలు చేస్తుందని సల్మాన్ అన్నారు. ఆర్.ఆర్.ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. సల్మాన్ ప్రకారం గేమ్ ఛేంజర్ సుమారు 2000 కోట్లు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ పనితీరు ప్రారంభ రోజు సమీక్షలు, ప్రేక్షకుల మౌత్ టాక్ పై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తతం బిగ్ బాస్ వేదికగా ప్రచారం చేస్తున్న చరణ్, కియరా ఇంకా ఇతర మెట్రో నగరాల్లోను అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు బన్ని పుష్ప 2 కోసం ప్రచారం చేసిన విధానాన్ని చరణ్ అనుసరిస్తున్నాడు. ఉత్తరాది బెల్ట్ లో అన్ని మెట్రోల్లో అభిమానులను పలకరించాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం.
ఇక బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ తో చరణ్ అనుబంధం గురించి తెలిసిందే. ఈ ఇద్దరూ రెండు దశాబ్దాలుగా మంచి స్నేహితులు. ముంబై వెళితే సల్మాన్ ని కలవనిదే చరణ్ తిరిగి ఇంటికి రాడు. అలాగే సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లో అడుగుపెడితే మెగా పవర్ స్టార్ ఆతిథ్యం స్వీకరించనిదే తిరిగి వెళ్లడు. అలాంటి అనుబంధం వారి మధ్య ఉంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కి సల్మాన్ తనవంతు ప్రచార సహకారం అందిస్తున్నాడు. బిగ్ బాస్ లో రామ్ చరణ్ - కియారా అద్వానీ పోటీదారులతో ఇంటరాక్ట్ అయ్యారు. కొన్ని టాస్క్‌లతో అలరించారు.