అయితే మంగ‌ళారం బ్యాచ్ అంటావా బండ్ల‌న్న‌?

Update: 2022-07-30 05:54 GMT
టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై రోజుకో కౌంట‌ర్ ప‌డుతోంది. సీ. క‌ల్యాణ్ నుంచి మొద‌లైన కౌంట‌ర్ల ప‌రంప‌ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే వుంది. దీనిపై బండ్లన్న బండ్ల గ‌ణేష్ ఏ స్థాయిలో స్పందిస్తాడా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్న‌ట్టే తాజా వివాదంపై స్పందించారు బండ్ల గ‌ణేష్‌. స్టార్ హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు, స్టార్ డైరెక్ట‌ర్ల పారితోషికాల‌తో పాటు నిర్మాణ వ్య‌వ‌యం పెరిగిపోవ‌డంతో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సభ్య‌లు ప్ర‌స్తుత స‌మ‌స్య‌లు ఓ కొలిక్కి రావాలంటే ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ లు బంద్ చేయాల్సిందే అంటూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.  

గిల్డ్ నిర్ణ‌యంపై తాజాగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. డి. సురేష్ బాబు, ఏషియ‌న్ సునీల్ నారంగ్‌, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ వంటి ప్రొడ్యూస‌ర్ లు దీనికి దూరంగా వుంటూ మౌనం వ‌హిస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం త‌మ గ‌ళం వినిపిస్తున్నారు. గిల్డ్ నిర్ణ‌యంపై ఘాటుగా స్పందిస్తున్నారు. గిల్డ్ లో స‌భ్యుల‌గా వున్నవారే షూటింగ్ లు బంద్ చేయ‌డం ఏంటి అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సీనియ‌ర్ నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ తాజాగా గిల్డ్ ని క‌డిగిపారేయ‌డం తెలిసిందే.

నిర్మాత‌ల మండ‌లి వుండ‌గా గిల్డ్ ఎందుకు పుట్టుకొచ్చిందో త‌న‌కు అర్థం కాలేద‌న్నారు. అంతే కాకుండా రెమ్యున‌రేష‌న్ లు త‌గ్గించాల‌ని డిమాండ్ చేయ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. మార్కెట్ ని బ‌ట్టే పారితోషికాలు ఇస్తామ‌న్నారు. ఇదిలా వుంటే తాజాగా బండ్ల గ‌ణేష్ మ‌రింత ఘాటుగా ఫైర్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంగ‌ళారం సామెత చెబుతూ ఏకిపారేయ‌డం కొంత మందికి న‌వ్వులు తెప్పిస్తోంది.

తాజాగా ఓ ఆడియో విడుద‌ల చేసిన బండ్ల గ‌ణేష్ అందులో గిల్డ్ స‌భ్యుల్లో క‌నీసం ఏ లైట్ లు వాడ‌తారో కూడా తెలియ‌ని మంగ‌ళారం బ్యాచ్ వున్నారంటూ సెటైర్లు వేశాడు. అంతే కాకుండా భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌తో తాను పూర్తిగా ఏకీభ‌విస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించాడు. అశ్వ‌నీద‌త్ 50 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో వున్నార‌న్నారు. ఏ హీరోను.. డైరెక్ట‌ర్ ను పారితోషికం త‌గ్గించుకోమ‌నే అర్హ‌త ఎవ్వ‌రికీ లేద‌ని అలా అడగ‌కూడ‌ద‌న్నారు. కార్ల‌లో ర‌కాలుంటాయని అన్ని కార్లే అయినా ఒక్కో కారుకు ఒక్కో రేటు ఉన్న‌ట్టే ఒక్కో హీరోకు ఒక్కో రేటు వుంటుంద‌న్నారు. ఎవ‌రి రేంజ్ వాళ్ల‌ది.. ఏ హీరో రేంజ్ ఆ హీరోకు వుంటుంద‌న్నారు. మ‌న‌కు న‌చ్చి ఎంత మార్కెట్ చేసుకోవాలో తెలిసిన‌ప్పుడు హీరోను అప్పోచ్ అయి సినిమా తీయాల‌ని స్ప‌ష్టం చేశారు.

అంతే కానీ హీరోల పారితోషికాలు త‌గ్గించుకోవాల‌ని చెప్ప‌డం క‌రెక్ట్ కాద‌న్నారు. అంతే కాకుండా హీరోల‌పై ప‌డి ఏడ‌వ‌డం ఏంట‌ని, గిల్డ్ లో వున్న వాళ్ల‌లో ఎంత మంది సినిమాలు తీస్తున్నారు? .. ఎంత మంది తీయ‌డం లేదో అంద‌రికి తెలుస‌న్నారు. గిల్డ్ స‌భ్యుల్లో వున్న వాళ్ల‌లో షీట్లు.. కాల్షీట్లకు తేడా తెలియ‌ని వాళ్లు, షూటింగ్ ఎప్పుడు మొద‌లై ఎప్పుడు పూర్త‌వుతుందో, ఏ రోజు ఏ లైట్లు వాడ‌తారో తెలియ‌ని వాళ్లు ఉన్నార‌ని తెలియారు.

గిల్డ్ ఎందుకు?.. ఈ మీటింగు లెందుకు? అంటూ ఫైర‌య్యారు. అంతేనా చెయ్య‌లేక మంగ‌ళారం అన్న‌డ‌ట ఎవ‌డో .. ఇవాళ మంగ‌ళ‌వారం కాక‌పోతే అంతు చూస్తాన‌న్నాడ‌ట అంటూ మంగ‌ళారం సామెతతో గిల్డ్ స‌భ్యుల‌ని ఏకి పారేయ‌డం ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో హిట్ టాపిక్ గా మారింది. మ‌రి బండ్ల‌న్న విమర్శ‌ల‌పై గిల్డ్ ఎలా స్పందిస్తుందో చూడాల‌ని కొంత మంది నిర్మాత‌లు ఆస‌క్తిగా చూస్తున్నారు.
Tags:    

Similar News