ప్రేక్ష‌కులు చేతులు ఎత్తేశారా?

Update: 2022-06-23 02:30 GMT
థియేట‌ర్ల ప‌రిస్థితి క‌రోనాకి ముందు క‌రోనాకు త‌రువాత అని చెప్పాల్సిందేనా? అంటే ప్ర‌స్తుతం మారుతున్న ప‌రిస్థితులు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. క‌రోనాకు ముందు సినిమా ఎలాంటిదైనా థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో కిక్కిరిసిపోయేవి. టికెట్ లు సాధార‌ణంగా దొరికేవి కావు. అది హిట్ సినిమా అయినా.. భారీ డిజాస్ట‌ర్ సినిమా అయినా హిట్ అయితే ఎందుకు హిట్ అయింద‌ని, డిజాస్ట‌ర్ అయితే ఎందుకు డిజాస్ట‌ర్ అయింద‌ని చూడ‌టానికి జ‌నం ఎగ‌బ‌డే వారు. కానీ ఇప్ప‌డు ప‌రిస్థితులు మారుతున్నాయి. అలా ఏ ఒక్క ప్రేక్ష‌కుడూ ఆలోచించ‌డం లేదు.

2001లో ఓ కంప‌నీ స‌ర్వే ప్ర‌కారం ఏపీ ప్రేక్ష‌కులు ఎంట‌ర్ టైన్ మెంట్ మీడియం సినీ రంగం కోసం దాదాపు 1800 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. వ‌చ్చిన ప్ర‌తీ సినిమాకు భారీగా ఖ‌ర్చు చేశార‌ట‌. థియేట‌ర్లలో గ‌త ఏడాది విడుద‌లైన ప్ర‌తీ సినిమాని ప్రేక్ష‌కులు భారీ స్థాయిలో ఆద‌రించారు. టికెట్ రేట్లు పెరిగినా.. భారీ సినిమాల కోసం అని టికెట్ రేట్లు పెంచినా టికెట్ కొని మ‌రీ థియేట‌ర్ల‌లో సినిమాలు చూశారు. దీంతో గ‌త ఏడాది విడుద‌లైన చాలా వ‌ర‌కు సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీలో కూడా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల ఆశ్చ‌ర్య ప‌రిచాయి.

దీంతో కోట్ల‌ల్లో సినిమాల‌కు వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. పెరిగిన టికెట్ రేట్లు కావ‌చ్చు.. గ‌త రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా సినిమాలు రిలీజ్ కాపోవ‌డం కావ‌చ్చు... మొత్తానికి ప్రేక్ష‌కులు మాత్రం తెలుగు సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దేశ వ్యాప్తంగా వున్న మిగ‌తా ఇండ‌స్ట్రీల వారు త‌మ సినిమాల‌ని ఓటీటీకి వ‌దిలేస్తుంటే టాలీవుడ్ కు మాత్రం ప్రేక్ష‌కులు అడంగా నిల‌బ‌డ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. గ‌తంతో పోలిస్తే భారీ స్థాయిలో సినిమాలని ఆద‌రించి భ‌య‌ప‌డుతున్న మేక‌ర్స్ కి మాన‌సిక ధైర్యాన్నిచ్చారు.

ఒక ద‌శ‌లో కొవిడ్ భ‌యంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా? .. మునుప‌టి స్థాయిలో సినిమాల‌ని ఆద‌రిస్తారా? అని చాలా మంది స్టార్ ప్రొడ్యూస‌ర్లు భ‌య‌ప‌డిపోయారు. భారీ స్థాయిలో కోట్ల‌ల్లో బ‌డ్జెట్ లు పెట్టి నిర్మించిన సినిమాల డ‌బ్బులు రిక‌వ‌రీ సాధ్య‌మేనా అని కొంత మంది నిర్మాత‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే ప్రేక్ష‌కులు మాత్రం దేశం లో ఏ ఇండ‌స్ట్రీకి స‌పోర్ట్ చేయ‌ని విధంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి స‌పోర్ట్ చేశారు. అండ‌గా నిలిచారు.

అయితే గ‌డిచిన కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల్లో మార్పులు సంభ‌విస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. విప‌త్క‌ర ప‌రిస్థితుల వేళ మేక‌ర్స్ కి అండ‌గా నిలిచిన ప్రేక్ష‌కులు క్ర‌మ క్ర‌మంగా థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు. పెరిగిన టికెట్ రేట్లు ఓ కార‌ణం కాగా క‌రోనా కార‌ణంగా రిలీజ్ కు రెడీ గావున్న సినిమాల‌ని బ్యాక్ టు బ్యాక్ దింపేసి థియేట‌ర్ల‌లో వారం గ్యాప్ తో హ‌డావిడి చేయ‌డం కూడా ఓ కార‌ణంగా తెలుస్తోంది.

ఈ కార‌ణంగానే గ‌త కొన్ని రోజులుగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించిన‌ట్టుగా తెలుస్తోంది. థియేట‌ర్ల‌లో టికెట్ ల భారం పెర‌గ‌డం.. రెండు మూడు వారాల్లో ఎంత పెద్ద సినిమా అయినా ఓటీటీలో వ‌చ్చేస్తుండ‌టంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు థియేట‌ర్లు ఖాలీగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన క్రేజీ సినిమాల‌కు కూడా థియేట‌ర్లు ఫుల్స్ కాలేదంటే ప‌రిస్థితి ఏంతో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ప‌రిస్థితుల్లో మార్పులు రావాలంటే టికెట్ రేట్ల‌పై నియంత్ర‌ణ వుండాల్సిందే న‌ని కొంత మంది ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Tags:    

Similar News