సీక్రెట్ రివీల్ చేసిన బ్యూటీ.. అప్పట్లో తాను అలాంటి వ్యాధి బారిన పడిందట

Update: 2022-03-31 05:40 GMT
ప్రపంచ సినిమాకు అత్యున్నత పురస్కారంగా భావించే అస్కార్ పురస్కార వేడుకల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోవటం తెలిసిందే. అవార్డుల్ని ప్రకటించేందుకు వీలుగా హాలీవుడ్ కమెడియన్ క్రిస్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దానికి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ స్టేజ్ మీదకు వెళ్లి మరీ అతడి చెంప పగలగొట్టిన వైనం తెలిసిందే. ఈ ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే. విల్ స్మిత్ తీరును పలువురు మద్దతు పలికితే.. మరికొందరు మాత్రం తప్పు పట్టారు. ఇలాంటి వైఖరి ఏ మాత్రం మంచిది కాదని తేల్చారు.

ఈ సందర్భంగా విల్ స్మిత్ భార్యను పట్టి పీడిస్తున్న 'అలోపేసియా ఏరియాటా' వ్యాధి బారిన తాను పడినట్లుగా డస్క్ బ్యూటీ.. తన క్యూట్ లుక్స్ తో యూత్ ను తెగ డిస్ట్రబ్ చేసిన సమీరారెడ్డి  తాజాగా రియాక్టు అయ్యింది. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పెద్ద పోస్టు పెట్టిన ఆమె.. గతంలో తాను సదరు వ్యాధి బారిన పడిన వైనాన్ని వెల్లడిస్తూ.. ఆ అనుభవం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పుకొచ్చింది.

ఈ వ్యాధితో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పటంతో పాటు.. దాని తీవ్రత ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేసింది. ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతుంటారని చెప్పిన సమీరా.. ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్ వ్యాధి అని.. దీని కారణంగా జుట్టు కుదుళ్లు పెద్ద ఎత్తున ఊడిపోతుంటాయని చెప్పింది. 2016లో తానీ వ్యాధి బారిన పడ్డానని.. ఇప్పుడు తాను దాని నుంచి పూర్తిగా కోలుకున్నట్లుగా వెల్లడించింది.

ఒక రోజు తన తన వెనుక భాగంలో ఉన్నట్లుండి రెండు అంగుళాల మేర జుట్టు ఊడిపోయి ఉండటాన్ని తన భర్త అక్షయ్ గుర్తించారని.. అదే నెలలో తన తలలోని రెండు మూడు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు పేర్కొంది.

ఇదేమీ అంటు వ్యాధి కాదని.. కానీ జుట్టు ఉన్నట్లుండి ఊడిపోతే మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. పెద్ద ఎత్తున కుంగుబాటుకు గురి చేసే ఈ వ్యాధి అసలు ఎందుకు వస్తుందన్నది ఇప్పటివరకు తేల్లేదని.. కచ్ఛితమైన కారణం కూడా లేదని చెప్పింది.

ఆ జబ్బు నుంచి తాను బయటపడ్డానని.. ఆ అనుభవం మాటల్లో చెప్పలేని వేదనను కలిగిస్తుందని పేర్కొంది. విల్ స్మిత్ ఎపిసోడ్ తో తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా షేర్ చేసుకోవటంతో.. సమీరా ఎదుర్కొన్న అనారోగ్య సమస్య తాజాగా బయటకు వచ్చిందని చెప్పాలి.
Tags:    

Similar News