సినిమా షూటింగులు..మెట్రోకు లాభాల పంట!

Update: 2019-06-15 06:31 GMT
కర్ణాటక రాజధాని బెంగళూరు మెట్రో స్టేషన్లలో సినీసందడి నెలకొంది. సినిమా షూటింగ్లకు అనుకూలంగా లొకేషన్లు ఉండటంతో కన్నడ - తమిళ - తెలుగు - హిందీ - మలయాళీ భాషల చిత్రాలతో పాటు డాక్యుమెంటరీలు - అడ్వర్టయిజ్మెంట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ కూడా నగదు రూపేణా ఒప్పందం చేసుకుంది. గత 2013లోనే సినిమా షూటింగ్లకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ల నుంచి బీఎంఆర్సీఎల్ కు సుమారు రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. మెట్రో స్టేషన్ లోని అందాలు - రైళ్లలో ప్రయాణిస్తూ చిత్రీకరణ చేస్తున్నారు. 2014 - 2015లో 4 సినిమాలు - 2016లో 3 - 2017లో ఆరు - 2018లో నాలుగు సినిమాలను మెట్రో స్టేషన్లు - రైళ్లలో చిత్రీకరించారు. అదేవిధంగా దేశ - విదేశాలకు చెందిన ప్రముఖ ప్రైవేటు ప్రకటనల కంపెనీలు కూడా షూటింగ్ లు చేశాయి.

మెట్రోస్టేషన్లు - రైళ్లలో సినిమా షూటింగ్ లకు కన్నడ సినీ ప్రముఖులే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి లొకేషన్లు - రియాలిటీ దృశ్యాలు చిత్రీకరణకు అనుకూలంగా ఉండటంతో విదేశీ సినిమాలు కూడా తీస్తున్నారు. ఈక్రమంలో బీఎంఆర్సీఎల్ కొన్ని షరతులు విధించింది. స్వదేశీయులు అయితే 15 రోజులు ముందుగా.. విదేశీయులు అయితే 30 రోజులు ముందుగా అనుమతి తీసుకోవాలి.

అంతేకాకుండా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చిత్రీకరణ చేసుకోవాల్సి ఉంది. మెట్రో సదుపాయాల నిమిత్తం ముందుగానే రూ.2.5కోట్లు బీమా చెల్లించాల్సి ఉంటుంది. మెట్రోలో షూటింగ్ అనుమతి కోసం గంటకు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.6 లక్షలు దాటితే జీఎస్టీ కూడా అదనంగా చెల్లించాలి. కాగా షూటింగ్ సమయంలో రైలును వినియోగిస్తే అదనంగా గంటకు మరో రూ.20 వేలు చెల్లించాలి. కన్నడ  చిత్రాలకు 25 శాతం రాయితీ ఉంటుంది.  బెంగళూరు మెట్రో చేస్తున్న ఈ లాభసాటి వ్యవహారం నుంచి హైదరాబాద్ మెట్రో కూడా నేర్చుకోవాల్సింది ఉందేమో!
Tags:    

Similar News