నాని ఎన్టీఆర్ నూ దాటేశాడే..

Update: 2015-09-15 11:30 GMT
పేరుకు తగ్గట్లే భలే భలే అనిపిస్తున్నాడు నాని. ‘భలే భలే మగాడివోయ్’ రెండో వారంలోనూ దుమ్ము దులిపింది. ముఖ్యంగా అమెరికాలో ఆ సినిమా జోరు మామూలుగా లేదు. తొలి వీకెండ్ కు దీటుగా కలెక్షన్ల వర్షం కురియడంతో మిలియన్ మార్కును దాటేసి.. ఒక్కో పెద్ద సినిమా రికార్డును దాటుకుంటూ ముందుకెళ్లిపోతోంది నాని సినిమా. తొలి వారం తర్వాత యుఎస్ బాక్సాఫీస్ లో తెలుగు సినిమాల టాప్-15లో చోటు సంపాదించిన  భలే భలే మగాడివోయ్.. రెండో వారానికి 12వ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో రెండు పెద్ద హిట్ సినిమాల్ని నాని దాటేశాడు. ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద హిట్లలో ఒకటైన టెంపర్ - నాని-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఈగ’ యుఎస్ కలెక్షన్ లను ‘భలే భలే మగాడివోయ్ దాటేసింది.

టెంపర్ 1.049 మిలియన్  డాలర్లు వసూలు చేసి 14వ స్థానంలో ఉండగా.. ఈగ 1.08 డాలర్లతో 13వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ 1.234 మిలియన్ డాలర్ లతో 12వ స్థానంలో కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలు గబ్బర్ సింగ్ (1.03 మి), గోపాల గోపాల (0.847 మి) 14, 15 స్థానాల్లో ఉన్నాయి. నాని సినిమా జోరు చూస్తుంటే టాప్-10లోకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 8, 9, 10, 11 స్థానాల్లో ఉన్న రేసుగుర్రం (1.395 మి), 1 నేనొక్కడినే (1.31 మి), బాద్ షా (1.28 మి), సన్నాఫ్ సత్యమూర్తి (1.275 మి) సినిమాల కలెక్షన్ లను దాటడం మరీ కష్టమేమీ కాదు. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మీడియం బడ్జెట్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ లు రాబట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. యుఎస్ లో ఈ సినిమాను 110 స్క్రీన్ లలో రిలీజ్ చేయడం విశేషం. అంత పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తుంటే కొందరు ఖర్చులు కూడా రావు, వృథా ప్రయత్నం అన్నారు. ఇప్పుడీ కలెక్షన్ లు చూసి వారి మైండ్ బ్లాంక్  అయిపోతోంది.
Tags:    

Similar News