మూవీ రివ్యూ : బిచ్చగాడు-2

Update: 2023-05-19 19:27 GMT
'బిచ్చగాడు-2' మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ ఆంటోనీ-కావ్య థాపర్-రాధా రవి-వైజీ మహేంద్రన్-మన్సూర్ అలీఖాన్-యోగిబాబు-జాన్ విజయ్-దేవ్ గిల్ తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: ఓం నారాయణ్
మాటలు: భాష్యశ్రీ
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
రచన-దర్శకత్వం: విజయ్ ఆంటోనీ

ఏడేళ్ల కిందట 'బిచ్చగాడు' అనే తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ సినిమాతో విజయ్ ఆంటోనీ ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత సరైన సినిమాలు చేయక ఆ క్రేజ్ అంతా కోల్పోయాడు. ఇన్నేళ్ల తర్వాత అతను 'బిచ్చగాడు'కు సీక్వెల్ చేయడం.. తనే ఆ చిత్రాన్ని నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఈ రోజే fప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బిచ్చగాడు-2' ఫస్ట్ పార్ట్ లాగే మెప్పించేలా ఉందేమో చూద్దాం పదండి.


కథ: విజయ్ (విజయ్ ఆంటోనీ) ఇండియాలో ఏడో అత్యంత ధనవవంతుడైన మల్టీ మిలియనీర్. తన చుట్టూ ఉండే ముగ్గురు వ్యక్తులు తన అడ్డు తొలగించుకుని ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో దుబాయిలో ఉండే డాక్టర్ మెహతా జంతువుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన మెదడు మార్పిడి శస్త్రచికిత్స గురించి తెలుసుకుని.. విజయ్ మీద దాన్ని ప్రయోగించాలనుకుంటారు. తన బ్లడ్ గ్రూప్ సహా అన్నీ దగ్గరగా ఉన్న సత్య అనే బిచ్చగాడిని కిడ్నాప్ చేసి ఈ సర్జరీ కూడా పూర్తి చేయిస్తారు. విజయ్ స్థానంలోకి వచ్చిన సత్య సాయంతో మొత్తం ఆస్తిని చేజిక్కించుకోవాలన్న వీరి ప్రయత్నం ఎంతమేర ఫలించింది.. సత్య వాళ్లకు సహకరించాడా.. చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

'బిచ్చగాడు' అనే టైటిల్ చూసి.. హీరో బిచ్చగాడు అని తెలిసి.. ముందు ఇదేం సినిమారా బాబూ అంటే వెటకారాలు ఆడారు తెలుగు ప్రేక్షకులు. అలా చిన్నచూపు చూసిన వాళ్లే.. తర్వాత లెంపలేసుకుని అదొక అరుదైన.. అద్భుతమైన సినిమా అని కొనియాడారు. ఒక మల్టీ మిలియనీర్.. తన తల్లిని బతికించుకోవడం కోసం బిచ్చగాడిగా మారడం అనే పాయింట్ ను ఎంతో హృద్యంగా.. మనసుకు హత్తుకునేలా చూపించిన 'బిచ్చగాడు' సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా వచ్చి ఎనిమిదేళ్లయింది. ఈ ఎనిమిదేళ్లలో విజయ్ ఆంటోని నుంచి రెండంకెల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.

మొదట్లో కాస్త మంచి సినిమాలే చేసిన అతను.. ఆ తర్వాత నటనలో.. అలాగే కథల ఎంపికలో తన బలహీనతలన్నీ బయటపెట్టుకున్నాడు. ఈ మధ్య విజయ్ సినిమాలు తెలుగులో అనువాదమవడం కూడా ఆగిపోయింది. అతణ్ని తెలుగు వాళ్లు పూర్తిగా మరిచిపోయిన స్థితిలో ఇప్పుడు 'బిచ్చగాడు-2' అంటూ వచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత 'బిచ్చగాడు'కు కొనసాగింపుగా ఓ సినిమా చేయడం.. దాన్నే తనే డైరెక్ట్ చేయడం చూస్తే.. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా కనిపించింది. కానీ 'బిచ్చగాడు'కు సీక్వెల్ అంటే ఎంతో కొంత విషయం ఉండకపోదని థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే.. మనకు దిమ్మదిరిగే 'బొమ్మ' చూపిస్తాడు విజయ్ ఆంటోనీ. అసలు 'బిచ్చగాడు' సినిమాకు దీనికి సంబంధమే లేదు. ఇది వేరే కథ. హీరోను ఇందులోనూ బిచ్చగాడిగా చూపించినా మొదటి భాగంలో మాదిరి ఇందులో మానవీయ కోణం ఎంతమాత్రం హృదయాలను తాకదు. ఇక కథ పరంగా కూడా అంతా కంగాళీగా తయారై.. 'బిచ్చగాడు' ఒక తలపోటు వ్యవహారంలా మారింది.

'బిచ్చగాడు'తో 'బిచ్చగాడు-2'ను ఎంతమాత్రం పోల్చుకోవడానికి వీల్లేదని ఈ సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. మనం ఏదో ఊహించుకుంటే విజయ్ ఆంటోనీ ఇంకేదో సినిమా చూపిస్తాడు. కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ ను 'బిచ్చగాడు-2' కోసం వాడేసుకున్నాడు విజయ్. ఒక మల్టీ మిలియనీర్ చుట్టూ ఉండే టీమ్.. అతడికి వ్యతిరేకంగా కుట్ర చేసి తనకు బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చేసి తన స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెట్టడం.. దీని చుట్టూ ప్రథమార్ధంలో డ్రామాను నడిపించారు. ఈ వ్యవహారం కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా.. చాలా సీన్లు ఇల్లాజికల్ గా సాగిపోతాయి. ఒక వ్యక్తికి బ్రెయిన్ మారిస్తే సరిపోతుందనుకున్నపుడు అచ్చం అలాంటి పోలికలే ఉన్న వ్యక్తిని వెతికి తీసుకొచ్చి తన మెదడు తీసి పెట్టడం ఏంటో అర్థం కాదు. ఇక లక్ష కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ప్రవర్తించే తీరు చూస్తే.. ఇంత తింగరోడు ఇంత రిచ్ ఎలా అయ్యాడో అని సందేహం కలుగుతుంది. అతణ్ని ఒక పపెట్ లాగా మార్చి చుట్టూ ఉన్న వాళ్లు సింపుల్ గా తమ పని తాము చేసుకుపోతారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ అనగానే కొంచెం ఇంటలిజెంట్ గా సన్నివేశాలు నడవాలని ఆశిస్తాం కానీ.. దర్శకుడిగా ఏమాత్రం పనితనం చూపించలేకపోయిన విజయ్ చాలా సిల్లీగా ఆ సీన్లు లాగించేశాడు. ఇక బిచ్చగాడి పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ అయితే ఓవర్ సెంటిమెంట్.. మెలోడ్రామాతో ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసేలా చేస్తుంది. విజయ్ స్థానంలోకి వచ్చే బిచ్చగాడు.. తనను ఆడించాలని చూసిన వాళ్లపై ఎదురు తిరిగి వాళ్ల కథను కంచికి చేర్చే సీన్ ఒకటి ప్రథమార్ధంలో హైలైట్ అయింది. తొలిసారి సినిమా కథ రసవత్తరంగా మారిన భావన కలుగుతుంది.

ఇంటర్వెల్ సమయానికి 'బిచ్చగాడు-2' కొంచెం గాడిన పడ్డట్లు అనిపించినా.. ద్వితీయార్ధంలో మాత్రం మళ్లీ ట్రాక్ తప్పేస్తుంది. హీరో మళ్లీ బిచ్చగాడిగా మారడంతో 'బిచ్చగాడు' తరహాలో హ్యూమన్ టచ్ ఉంటుందని.. హృద్యమైన సన్నివేశాలు చూస్తామని ఆశిస్తాం. కానీ తీవ్ర నిరాశ తప్పదు. పేరుకు సెంటిమెంట్ సీన్లే తప్ప.. ఏవీ హృదయాన్ని తాకవు. ఇక 'యాంటీ బికిలి' అంటూ హీరో తన ఆస్తినంతా పేదలకు సాయం చేయడానికి ఉపయోగించాలని నడుం బిగించడం... ఆ తర్వాత వచ్చే సన్నివేశాలైతే సినిమా మీద పూర్తిగా ఆశలు కోల్పోయేలా చేస్తాయి. హీరో పదే పదే 'స్పీకర్'గా మారిపోయి పేదరికం గురించి.. సేవ గురించి స్పీచులు దంచడంతోనే చివరి 40 నిమిషాల సినిమా నడిచిపోతుంది. కోర్టు సీన్లయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. మామూలుగా తమిళ సినిమాల్లో ఉండే అతి అంతా ఇక్కడ కనిపిస్తుంది. పదే పదే మీడియా గొట్టాల ముందు జనాలు అభిప్రాయాలు వెల్లడించే సీన్లు పెట్టి చికాకు పెట్టించేశాడు విజయ్ ఆంటోనీ. ఇవి చాలవన్నట్లు మధ్య మధ్యలో యాక్షన్ ఎపిసోడ్లు కూడా విసుగును పెంచుతాయి. సినిమా మొదలైన తీరుకు.. ముగిసే వైనానికి అసలు పొంతన ఉండదు. 'బిచ్చగాడు'లో హైలైట్ అయిన హ్యూమన్ యాంగిల్ ను 'బిచ్చగాడు-2'లో ఎంతమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు విజయ్ ఆంటోనీ. హీరో పాత్రకు కూడా సరైన ఎలివేషన్ ఇవ్వలేకపోయాడు. 'బిచ్చగాడు'తో పోలిస్తే ఎక్కువ బడ్జెట్ పెట్టి రిచ్ గా సినిమా తీయగలిగాడు తప్ప.. అందులో పావు వంతు కంటెంట్ కూడా ఇవ్వలేకపోయాడు.


నటీనటులు:

విజయ్ ఆంటోనీ బేసిగ్గా అంత మంచి నటుడేమీ కాదు. మూడీగా కనిపించే తనకు సీరియస్ పాత్రలు సూటవుతాయి. కథలు బాగుండి.. తనకు క్యారెక్టర్లు సూటైనపుడు ఓకే అనిపించాడు కానీ.. నటుడిగా తన బలహీనతలు వేరే సినిమాల్లో బయటపడిపోయాయి. 'బిచ్చగాడు-2'లో సినిమా అంతా అతను సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో లాగించేశాడు. తెర మీద ఏ రసం పండిస్తున్నా.. అతను మాత్రం ఒకే రకమైన హావభావాలు ఇచ్చాడు. రొమాన్స్.. యాక్షన్ రెండింట్లోనూ ఒకే హావభావాలను మెయింటైన్ చేయడం అతడికే చెల్లింది. కావ్య థాపర్ ఆరంభంలో వచ్చే పాటలో చాలా హాట్ హాట్ గా కనిపించింది. నటన పరంగా చెప్పడానికి ఏమీ లేదు. తన పాత్ర ప్రాధాన్యం కూడా క్రమంగా తగ్గిపోయింది. విలన్ పాత్రల్లో దేవ్ గిల్.. జాన్ విజయ్.. వై.జి.మహేంద్రన్ ఓకే అనిపించారు. రాధారవి ముఖ్యమంత్రి పాత్రలో బాగానే చేశాడు. యోగిబాబు కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు. మిగతా నటీనటులంతా మామూలే.


సాంకేతిక వర్గం:

'బిచ్చగాడు-2' నిర్మాణ విలువల వరకు మెరుగ్గా అనిపిస్తుంది. నిర్మాత కూడా అయిన విజయ్ ఆంటోనీ.. రాజీ పడలేదు. తన మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టాడు. ఒక పెద్ద హీరో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు ప్రథమార్ధంలో. ఓం నారాయణ్ కెమెరా పనితనం బాగానే సాగింది. విజయ్ ఆంటోనీ సంగీతం ఆకట్టుకోలేదు. 'బిచ్చగాడు'లో మాదిరి టచింగ్ సాంగ్స్ ఇవ్వలేకపోయాడు. ఆర్ఆర్ కూడా ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే. రైటింగ్ దగ్గరే 'బిచ్చగాడు-2' తేడా కొట్టేసింది. రకరకాల అంశాలను కలిపి కిచిడీలాగా తయారు చేశారు స్క్రిప్టును. దర్శకుడిగా విజయ్ అపరిపక్వత చాలా సీన్లలో స్పష్టంగా కనిపిస్తుంది. 'బిచ్చగాడు' తీసిన శశికి.. విజయ్ కి ఏమాత్రం పోలిక లేదు. ఊరికే 'బిచ్చగాడు' పేరును వాడుకుని విజయ్ ఒక కంగాళీ కథను.. గందరగోళంగా నరేట్ చేశాడు. దర్శకుడిగా విజయ్ పూర్తిగా విఫలమయ్యాడు.

చివరగా: బిచ్చగాడు 2.. డబుల్ డిజప్పాయింట్మెంట్

రేటింగ్-2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Similar News