కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల ప్రభావంతో మూడు నెలలు థియేటర్లు మూతబడి ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పోయిన శుక్రవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. తెలంగాణలో అన్ని ఆంక్షలు ఎత్తేయడమే కాకుండా.. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్రమే పర్మిషన్ ఉంది. అంతేకాదు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుండటంతో థియేటర్లలో సెకండ్ షో కు అవకాశం లేదు. వివిధ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, కరోనా థర్డ్ వేవ్ ముందు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
థియేటర్లు రీ ఓపెన్ అయితే ప్రేక్షకులకు ముందుకు రావాలని సమ్మర్ లో వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ వెయిట్ చేస్తున్నాయి. మొన్న శుక్రవారం విడుదలైన 'తిమ్మరుసు' 'ఇష్క్' చిత్రాలకు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయాలని చాలా చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ సినిమాలకు వచ్చిన ఆదరణ బట్టి చూస్తే జనాల్లో థర్డ్ వేవ్ వస్తుందనే సందేహాలు ఉన్నట్లు అర్థం అవుతోంది.
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్ తెరిచిన వెంటనే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు బాగానే వచ్చారు. దీనికి కారణం కోవిడ్ మహమ్మారి అంతరించి పోయిందనే భావన జనాల్లో ఉండటం.. సెకండ్ వేవ్ అనేది ఉంటుందని తెలియకపోవడం ఆనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గినా మూడో వేవ్ ప్రమాదం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చాలామంది భయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, వేసవిలో విడుదల కాకుండా వాయిదా పడిన చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పెద్ద సినిమాలు 'లవ్ స్టోరీ' - 'టక్ జగదీష్'. నాలుగు షో లకు అనుమతి ఇస్తే సినిమా హాళ్లు తెరిచిన వెంటనే ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇండిపెండెన్స్ వీక్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే పరిస్థితులు చూస్తే భిన్నంగా ఉన్నాయి. ఆగస్ట్ లో తమ సినిమాలను రిలీజ్ చేయాలా వద్దా అనే డైలమాలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ ఆంక్షలు సడలించి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వడం.. టికెట్ రేట్లను సవరించడం గురించి ఆలోచిస్తే ఆగస్ట్ నెలాఖరున చాలా సినిమాలు రిలీజ్ డేట్లను ప్రకటించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 'లవ్ స్టోరీ' చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసే సాధ్యాసాధ్యాలపై మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'టక్ జగదీష్' ను కూడా వారం గ్యాప్ లో తీసుకురావొచ్చు. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి
కాగా, నాగ చైతన్య - సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని - రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'టక్ జగదీష్'. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.