'బిగ్ బాస్ 6' ప్రోమో షూట్ పూర్తి.. ఈసారి హోస్ట్ ఎవరంటే..?

Update: 2022-08-01 16:30 GMT
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మన దేశంలోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. అన్ని ప్రధాన భారతీయ భాషల్లో రూపొందించబడిన ఈ షో.. తెలుగులోకి కాస్త ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ అత్యధిక టీఆర్పీతో ఇప్పటికే ఐదు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

అలానే 'బిగ్ బాస్ నాన్ స్టాప్' పేరుతో ఓటీటీలోనూ 24×7 అలరించింది. దీంతో ఇప్పుడు తదుపరి సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నిర్వహకులు ''బిగ్ బాస్ 6'' కోసం సన్నాహకాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

గత కొన్ని సీజన్ల నుంచి విజయవంతంగా నడిపించిన కింగ్ అక్కినేని నాగార్జున ఈ కొత్త సీజన్ కు కూడా హోస్టుగా వ్యవహరించనున్నారు. ఇటీవలే అన్న‌పూర్ణ స్టూడియోలో నాగ్ తో ప్రోమోని షూట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి టాలీవుడ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌ దర్శకత్వం వహించినట్లు సమాచారం.

'అ!' 'క‌ల్కి' 'జాంబీరెడ్డి' చిత్రాల‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ప్రస్తుతం 'హ‌నుమాన్‌' అనే పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు నాగార్జున‌తో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్ కోసం ప్రోమోని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇంతకముందు 'బిగ్ బాస్ 5' ప్రోమోకి కూడా ప్రశాంత్ వర్మనే దర్శకత్వం వహించారు. 'చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై.. వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ 5' అంటూ నాగ్ ను తనదైన శైలిలో చూపించారు. ఇప్పుడు 'బిగ్ బాస్ 6' ప్రోమోలోనూ కింగ్ ను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారని టాక్.

ఇప్పటికే 'బిగ్ బాస్' లేటెస్ట్ సీజన్ ప్రోమో చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. చిన్న ప్రోమో అయినా భారీగానే షూట్ చేశారట. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ ప్రోమో బ‌య‌టకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి బిగ్ బాస్ కోసం డిఫరెంట్ థీమ్ తో అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ హౌస్ ను రూపొందిస్తున్నారట.

అంతేకాదు ఈసారి క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్‌ ని కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని టాక్. వంద రోజులకు పైగా జరిగా ఈ షోలో.. పలువురు సినీ ప్రముఖులను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. గత రెండు సీజన్లను గమనిస్తే సోషల్ మీడియా సెలబ్రెటీలు - బుల్లితెర యాక్టర్స్ మరియు న్యూస్ యాంకర్లు బిగ్ బాస్ లో సందడి చేశారు.

అయితే ఈసారి 'బిగ్ బాస్ 6' షోలో సినిమా వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం వుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రైజ్ మ‌నీ కూడా పెంచబోతున్నారట. సెప్టెంబర్ రెండో వారం నుండి 'బిగ్ బాస్ తెలుగు' సీజన్-6 ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News