బుల్లితెర మీద బిగ్ బాస్ షో కొత్తేం కాదు. కానీ.. తెలుగోడికి సరికొత్త అనుభూతిని పంచిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 విజేత ఎవరన్నది తేలిపోయింది. 70 రోజులు.. 14 మంది పోటీదారులు.. మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోటాపోటీగా సాగిన ఈ రియాల్టీ షో ఫలితం వచ్చేసింది. తెలుగు టీవీ రంగ చరిత్రలో భారీ టీఆర్పీ రేటింగ్‌ను సాధించటమే కాదు.. ప్రేక్షకాదరణ.. వీక్షకుల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించిన బిగ్ బాస్ షో సీజన్ 1 ఈ రోజు (ఆదివారం)తో ముగిసిందని చెప్పాలి.
ఇక.. గ్రాండ్ ఫైనల్లో ఐదుగురు పోటీదారులు (అర్చన.. అదర్శ్.. హరితేజ.. శివబాలాజీ.. నవదీప్) మిగిలారు. గ్రాండ్ ఫైనల్ విజేతను తేల్చేందుకు రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి నుంచి 11.95కోట్ల ఓట్లు వచ్చినట్లుగా షో నిర్వాహకులు వెల్లడించారు. ఇక.. గ్రాండ్ ఫైనల్ లో భాగంగా ఎలిమినేషన్ రౌండ్ లో తొలుత అర్చన్ ఎలిమినేట్ కాగా.. ఆ తర్వాత నవదీప్ అయ్యారు. అనంతరం హరితేజ ఎలిమినేట్ కావటంతో.. ఆఖరుగా శివబాలాజీ.. అదర్శ్ లు నిలిచారు.
వీరిద్దరూ ఫైనలిస్ట్ లుగా నిలిచిన తర్వాత దాదాపు అరగంట పాటు ఉత్కంటతో షో ను సా..గదీశారు. కమర్షియల్ బ్రేకుల మీద బ్రేకులు ఇస్తూ.. ఎట్టకేలకు విజేతగా శివబాలాజీని ఎంపికైనట్లుగా ప్రకటించారు.
విజేతకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీతో పాటు.. బిగ్ బాస్ ట్రోఫీని బహుకరించారు. ఫైనల్ లో నిలిచిన ఇద్దరు కంటెస్టెంట్లకు మధ్యన ఓట్ల వ్యత్యాసం కేవలం 8.5 లక్షలు మాత్రమే. విజేత అయిన శివబాలాజీకి 3.34కోట్ల ఓట్లు వస్తే.. అదర్శ్‌కు 3.25 కోట్ల ఓట్లు వచ్చినట్లుగా వెల్లడించారు. 70 రోజులుగా తెలుగింటి లోగిళ్లలో నిత్యం ఇంటి సభ్యులుగా మారిన బిగ్ బాస్ ఇంటి లైట్లు ఆర్పేశారు. తెలుగుప్రజల నిత్యజీవితంలో భాగంగా మారిన బిగ్ బాస్ షో.. భావోద్వేగాల మధ్య ముగింపు పలికారు. ఇంటి సభ్యుల్ని.. తెలుగు ప్రజల ఇంటి సభ్యులుగా ఫీలైన గురుతలన్నీ ఇకపై తియ్యటి మెమరీస్ గా మారనున్నాయి.