నిర్మాత కూతురు ట్వీట్‌ తో వందల కోట్లు బయటకు లాగిన ఐటీ

Update: 2020-02-07 15:30 GMT
గత మూడు రోజులుగా తమిళ సినీ ఇండస్ట్రీలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న రైడ్స్‌ గురించి చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు విజయ్‌ ను టార్గెట్‌ చేశారు అంటూ కొందరు.. రాజకీయ నాయకులను ఏం చేయలేక ఇండస్ట్రీ వారిపై సోదాలా అంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో మీరు సాధించింది ఏంటీ అంటూ ఐటీ అధికారులను ప్రశ్నిస్తున్న విజయ్‌ అభిమానులకు ఐటీ అధికారులు దిమ్మతిరిగిపోయే విషయాలను చెబుతున్నారు. బిగిల్‌ చిత్ర నిర్మాత అక్రమ ఆస్తులు.. కలిగి ఉన్న నగదు వివరాలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

బిగిల్‌ చిత్రాన్ని నిర్మించిన కల్పాత్తి అఘోరా కుమార్తె అర్చన ట్విట్టర్‌ లో బిగిల్‌ చిత్రం జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల టాప్‌ 10 జాబితాలో నిలిచిందంటూ చాలా గొప్పగా ప్రకటించింది. దాంతో ఐటీ అధికారుల్లో అనుమానం మొదలైంది. చిత్ర నిర్మాత సమర్పించిన ఐటీ రిటర్న్స్‌ మరియు హీరో విజయ్‌ సమర్పించిన ఐటీ రిటర్న్‌ ను పరిశీలించగా బిగిల్‌ సినిమాకు విజయ్‌ తీసుకున్న పారితోషికం మరియు నిర్మాత ఇచ్చిన పారితోషికంను ఇద్దరు వేరు వేరుగా చూపించారట. అక్కడ మొదలైన అనుమానంతో ఐటీ అధికారులు బిగిల్‌ చిత్ర నిర్మాణ సంస్థ అయిన ఏజీఎస్‌ ఆఫీస్‌ లలో సోదాలు నిర్వహించారు. బుధ మరియు గురువారాల్లో ఏమాత్రం విరామం లేకుండా ఐటీ అధికారులు ఏజీఎస్‌ ఆఫీస్‌ లతో పాటు విజయ్‌ ఇంట్లో మరియు ఆఫీస్‌ లో సోదాలు నిర్వహించారు.

మాస్టర్‌ షూటింగ్‌ లో ఉన్న విజయ్‌ ను షూటింగ్‌ ఆపివేసి మరీ చెన్నైకి ఐటీ శాఖ వారు ప్రభుత్వ కారులో తీసుకు రావడం జరిగింది. సుదీర్ఘ సమయం పాటు విజయ్‌ ను విచారించడంతో పాటు ఆయన ఆస్తుల వివరాలను మరియు ఇంట్లో ఉన్న నగదు ఇతరత్ర విషయాలపై లెక్కలు తీసుకున్నారు. ఇక మరో వైపు ఏజీఎస్‌ ఆఫీస్‌ మరియు నిర్మాత ఇంట్లో సోదాలు నిర్వహించగా డబ్బు కట్టలతో ఉన్న బ్యాగ్‌ లు మరియు కోట్ల విలువ చేసే వజ్రాలు.. బంగారం బయట పడ్డాయి. అంతే కాకుండా దాదాపుగా 500 కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లభ్యం అయ్యాయట.

ఏజీఎస్‌ ఆఫీస్‌ లో ఏకంగా 77 కోట్ల రూపాయల నగదు లభ్యం అవ్వడం ప్రస్తుతం షాకింగ్‌ గా ఉంది. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఫైనాన్సియర్‌ గా మరియు నిర్మాతగా కొనసాగుతున్న కల్పాత్తి అఘోరా మొత్తం అక్రమంగా.. బ్లాక్‌ మనీతోనే బిజినెస్‌ చేస్తున్నాడా అంటూ సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. డబ్బులను లెక్కించేందుకు చిన్న మెషన్స్‌ సరిపోక పోవడంతో బ్యాంకుల నుండి పెద్ద మెషన్స్‌ తెప్పించి మరీ అధికారులు దాదాపుగా మూడు గంటల పాటు లెక్కించినట్లుగా తెలుస్తోంది. అఘోరా ఆఫీస్‌ లు మరియు ఇళ్ల నుండి స్వాదీనం చేసుకున్న పత్రాలు మరియు డబ్బు బంగారం విలువ కట్టి చూడగా దాదాపుగా 300 కోట్ల ఆదాయ పన్నును ఎగేసినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. ఇక ఆ ఆదాయానికి అఘోరా సరైన లెక్కలు కూడా చూపించలేదట.

మరో వైపు విజయ్‌ ఇంట్లో కూడా ఆదాయానికి మించిన ఆస్తులు మరియు డబ్బు బంగారంను అధికారులు స్వాదీనం చేసుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.  విజయ్‌ దాదాపుగా 100 కోట్ల వరకు పన్ను ఎగవేసినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు. తమ అభిమాన హీరో ఇంటిపై ఐటీ దాడులను నిరసిస్తూ ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు. ఐటీ అధికారులు మాత్రం ఇంకా లోతుగా నిర్మాత అఘోరా మరియు విజయ్‌ బ్యాంకు ఖాతాను మరియు వారి బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్‌ వంద కోట్ల పన్ను ఎగవేయడం వల్లే షూటింగ్‌ నుండి అర్థాంతరంగా తీసుకు వెళ్లారని.. ఆయన్ను విచారించాల్సిన అవసరం ఉంది కనుకే సొంత వెయికిల్‌ లో కాకుండా ప్రభుత్వ వెయికిల్‌ లో తీసుకు వెళ్లినట్లుగా ఐటీ అధికారులు చెబుతున్నారట.


Tags:    

Similar News