హిందీలో 'బింబిసార'.. పాన్ ఇండియా దృష్టిని ఆకర్షిస్తుందా..?

Update: 2022-11-11 16:30 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఫిక్షనల్ సోసియో ఫాంటసీ యాక్షన్ మూవీ ''బింబిసార''. ఆగస్టులో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

'బింబిసార' సినిమా థియేట్రికల్ రిలీజ్ లో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత.. దీపావళి సందర్భంగా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ Zee5 వేదికగా స్ట్రీమింగ్ కాబడిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

అయితే ఇప్పుడు 'బింబిసార' ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా ఈ చిత్రాన్ని హిందీతో పాటుగా తమిళ కన్నడ మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన మేకర్స్.. "మీ ప్రేమకు అందరికీ ధన్యవాదాలు. మేము హిందీలో 'బింబిసార' తో మీ దగ్గరికి వస్తున్నాము" అని పేర్కొన్నారు. అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ సినిమా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది.

నిజానికి ఇటీవల కాలంలో దక్షిణాది చిత్రాలకు నార్త్ లో విశేష ఆదరణ లభిస్తుండటంతో.. "బింబిసార" సినిమాని కూడా హిందీలోకి డబ్ చేసి, థియేట్రికల్ రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావించారు. అయితే ఎందుకనో ఇప్పుడు డిజిటల్ రిలీజ్ ద్వారా హిందీలోకి తీసుకొచ్చారు.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిగర్తల చక్రవర్తి బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు. పరిమిత బడ్జెట్ లో తీసినా.. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించారు.

'బింబిసార' సినిమాలో కేథరిన్ థ్రెసా - సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. వారీనా హుస్సేన్ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడగా.. ప్రకాష్ రాజ్ - రాజీవ్ కనకాల - సాయి కిరణ్ - వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - శ్రీనివాస రెడ్డి - అయ్యప్ప శర్మ - వైవా హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

బింబిసార చిత్రాల్ని రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దర్శకుడు మల్లిడి వశిష్ట" బింబిసార2 " స్క్రిప్ట్‌ పై పని చేస్తున్నాడని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News