'సోల్ ఆఫ్ వెన్నెల'.. ఆమెది చరిత్రలో నిలిచిపోయే ప్రేమ..!

Update: 2022-05-09 06:44 GMT
హాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''విరాట పర్వం''. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కరోనా పాండమిక్ నేపథ్యంలో విడుదలకు నోచుకోలేదు. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

'విరాటపర్వం' మూవీని జూలై 1న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ప్రేరణతో, నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలలో రానా - సాయి పల్లవి కనిపించనున్నారు.

విప్లవకారుడు, కామ్రేడ్ రవన్న అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌ పాత్రలో రానా.. అతని రచనలకు వీరాభిమాని అయిన వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది. ఇప్పటికే విడుదలైన 'విరాటపర్వం' ప్రచార చిత్రాలు - టీజర్ - ఫస్ట్ సింగిల్ 'కోలు కోలు' మరియు వాయిస్ ఆఫ్ రవన్న గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

ఇవాళ హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం 'సోల్ ఆఫ్ వెన్నెల' పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. 'వెన్నెల రెండుసార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు అడవి తల్లి ఒడిలో ఒకసారి.. ఆశయాన్ని ఆయుధం చేసినట్టు అతని ప్రేమలో మరొకసారి' అంటూ ఇందులో సాయి పల్లవి పాత్ర స్వభావం గురించి వివరించారు.

'నిర్బంధాలు గౌగిలించుకున్న వసంతకాలం మనది.. రేపు మనమున్నా లేకపోయినా చరిత్ర ఉంటుంది.. మన ప్రేమను వినిపిస్తుంది' అని పల్లవి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'విరాటపర్వం' సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ అని తెలుస్తోంది.

కెరీర్ ప్రారంభం నుంచీ ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ వస్తోన్న సాయి పల్లవి.. 'విరాటపర్వం' చిత్రంతో మరోసారి తన సహజమైన నటనతో మెస్మరైజ్ చేయబోతోందని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సోల్ ఆఫ్ వెన్నెలకు బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రియమణి - నందితా దాస్ - నవీన్ చంద్ర - జరీనా వహాబ్ - ఈశ్వరీ రావు - సాయి చంద్ బెనర్జీ - నాగినీడు - రాహుల్ రామకృష్ణ - దేవి ప్రసాద్ - ఆనంద్ రవి - ఆనంద్ చక్రపాణి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. డానీ సాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. శ్రీ నాగేంద్ర ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. 'నీది నాది ఒకటే కథ' వంటి సూపర్ హిట్ తర్వాత వేణు డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. రానా - సాయి పల్లవి లకు ఎలాంటి గుర్తింపు తెచ్చి పెడుతుందో చూడాలి.


Full View

Tags:    

Similar News