సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేప‌ట్టండి : బీజేపీ ఎంపీ

Update: 2020-06-28 11:30 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే సుశాంత్ మరణంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ న‌టి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు అనుసరిస్తున్న తీరులో చాలా లోపాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు. అతని మరణం వెనుక నిజాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని రూపా గంగూలీ డిమాండ్ చేసారు.

అంతేకాకుండా సుశాంత్ సింగ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్‌ ను ఎవరో అనుమానాస్పద రీతిలో ఆపరేట్ చేస్తున్నారు. ఆ అకౌంట్‌ నుంచి కొన్ని పోస్టులను డిలీట్ చేస్తున్నారు. ఆ అకౌంట్‌లో దర్యాప్తుకు అవసరమయ్యే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు అంటూ రూపా గంగూలీ తన ట్విట్టర్‌ లో పోస్టు చేసిన ఓ వీడియోలో ఆరోపించారు. సుశాంత్ ఇంస్టాగ్రామ్ అకౌంట్‌ లోని సాక్ష్యాలను నాశనం చేస్తున్నారనే విషయం నా దృష్టికి వస్తే మొదట నమ్మలేదని.. కానీ ఆ తర్వాత కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని నా వద్ద పెట్టుకొన్నానని.. ఇప్పుడు జరుగుతున్న మార్పులు చూసి షాక్ తిన్నానని చెప్పుకొచ్చింది.

సుశాంత్ మరణం తర్వాత చోటుచేసుకొంటున్న పరిణామాలను చూస్తుంటే ఈ కేసులో ఏదో మిస్టరీ ఉందని.. ఈ కేసు విచారణలో పారదర్శకత్వ కావాలి. మరి సీబీఐ ఎప్పుడు జోక్యం చేసుకొంటుంది అని ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్రమోదీ మరియు హోంమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు. సుశాంత్ 14వ తేదీన మరణిస్తే ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్స్ వాళ్లు జూన్ 15వ తేదీన వచ్చారు. సాక్ష్యాలు కనుమరుగైపోయిన తర్వాత ఆధారాలు సేకరిస్తారా అని ఆమె ఫైర్ అయ్యారు. మరణం గానీ, హత్య గానీ జరిగినప్పుడు సీన్‌ కు సంబంధించిన సమాచారంపై సరైన క్లారిటీ రాబట్టుకోవడం పౌరులకు సాధ్యం కాదా.. సంఘటనా స్థలంలో వ్యక్తుల వేలిముద్రలు సేకరించడం సాధ్యపడదా.. అలాంటి విషయాలను తారుమారు చేయవచ్చనే విషయం అందరికీ తెలియదా అని ప్రశ్నించారు. వీలైనంత త్వ‌ర‌గా సీబీఐ దర్యాప్తు చేసి ఈ కేసును విచారించాల‌ని ఎంపీ రూపా గంగూలీ డిమాండ్ చేశారు.
Tags:    

Similar News