పెదనాన్న కృష్ణంరాజు మరణం డార్లింగ్ ప్రభాస్ ని ఎంతగా కృంగదీసిందో చెప్పాల్సిన పనిలేదు. కుమారులు లేని కృష్ణంరాజుకి తానే అన్నీ అయ్యారు. పరిశ్రమలో కృష్ణంరాజు వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఏకైక స్టార్ అతను. సోదరుడి కుమారుడిని నటుడిగా పరిచయం చేసే బాధ్యతలు పెదనాన్న తీసుకోవడంతో ఆయనకు ప్రభాస్ మరింత దగ్గరయ్యారు.
ఆ రకంగా ప్రభాస్-కృష్ణంరాజు బాండింగ్ ఎంతో ప్రత్యేకమైనది. కృష్ణరాజు మరణంతో డార్లింగ్ నిరాశనిస్పృహల్లోకి జారుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ బాధల నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియా ప్రభాస్ గురించి ఆసక్తికర కథనాల్ని ప్రచురిచడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ లో `ఆదిపురుష్` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో రాముడి పాత్రలో డార్లింగ్ కనిపించనున్నారు. అలాగే సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్-కృతి సనన్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
కొన్ని నెలలుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. ఇంత కాలం లేని వార్తలు ఇప్పుడే తెరపైకి రావడం వెనుక కారణం ఏంటంటూ విశ్లేషించగా... కొంత మంది నెటి జనులు సినిమా ప్రచారం కోసం ఇలాంటి కట్టు కథనాలు అల్లుతున్నారంటూ మండిపడుతున్నారు. ప్రభాస్ ప్రస్తుత మానసిక పరిస్థితిని కూడా పట్టించుకోకుండా బాలీవుడ్ మీడియా ఇలాంటి వార్తల్ని పనిగ్గట్టుకుని ప్రచారం చేస్తుందంటూ డార్లింగ్ అభిమానులు మండిపడుతున్నారు.
వాస్తవాలు గ్రహించకుండా ఇష్టానుసారం కథనాలు అల్లడంపై టాలీవుడ్ సైతం మండిపడుతుంది. ప్రభాస్ పాన్ ఇండియా ఎదుగదలను ఓర్వలేక బాలీవుడ్ మీడియా ఇలాంటి కథనాల్ని ప్రచారం చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఢిల్లీలోని ప్రసిద్ధ లవకుశ రామలీలాలో ప్రభాస్ పాల్గొని రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రమోషన్లను ప్రారంభిస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభాస్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్నది సందేహంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ కుటుంబానికి దగ్గరుండాల్సిన బాధ్యత ఉంది. పెదనాన్న కర్మకాండల పనుల్ని దగ్గరుండి నిర్వహించాలి. వాటిని పూర్తిచేసి మానసికంగా దృఢంగా మారడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటివరకూ ప్రభాస్ ఎలాంటి సినిమా షూటింగ్ లకు గానీ..ప్రచార కార్యక్రమాలకు గానీ హజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.