మలయాళం హీరోకు మళ్లీ మొండిచెయ్యే

Update: 2017-09-18 11:48 GMT
మలయాళ స్టార్ హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో మూడు నెలల కిందట అరెస్టయిన స్టార్ హీరో దిలీప్ బెయిల్ పిటిషిన్ ఇప్పటికే మూడుసార్లు తిరస్కరణకు గురైంది. బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని.. అతడిపై విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెప్పిన వాదనకు అంగీకరించి కోర్టు మూడుసార్లు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. ఐతే నాలుగోసారి మాత్రం పక్కాగా బెయిల్ వస్తుందని.. కోర్టు ఇందుకు పచ్చ జెండా ఊపుతుందని.. దిలీప్ బయటికి వచ్చేస్తున్నాడని అతడి మద్దతుదారుల్లో గట్టిగా ప్రచారం జరిగింది. కేరళ మీడియా కూడా ఇలాగే వార్తలు ఇచ్చింది. కానీ అంచనాలు తప్పాయి. దిలీప్ బెయిల్ పిటిషన్ నాలుగోసారి కూడా తిరస్కరణకు గురైంది.

చాన్నాళ్లుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న దిలీప్ సినిమా ‘రామ్ లీలా’ను ఈ నెల 28కి షెడ్యూల్ చేసిన నేపథ్యంలో దాని కంటే ముందే దిలీప్ బయటికి వస్తాడని.. ప్రమోషన్లలో కూడా పాల్గొంటాడని.. రిలీజ్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని కూడా పరిష్కరిస్తాడని ఆశించాడు నిర్మాత. కానీ అతడి ఆశ ఫలించలేదు. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ‘రామ్ లీలా’ థియేటర్లలను అటాక్ చేయడానికి సినీ పరిశ్రమకు చెందిన కొన్ని వర్గాలు.. మహిళా సంఘాల ప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లలో బాంబులు పేలుస్తామంటూ యాజమాన్యాలకు బెదిరింపులు కూడా వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘రామ్ లీలా’ సజావుగా విడులవుతుందా అన్నది సందేహమే.

Tags:    

Similar News