సౌత్ లో ఎక్క‌డ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టినా జ‌ల‌గ‌లా ప‌ట్టేస్తున్నాడు!

Update: 2020-10-13 02:30 GMT
అవును.. ఆ హిందీ నిర్మాత సౌత్ లో ఎక్క‌డ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టినా దోమ‌లా వాల్తున్నాడు! జ‌ల‌గ‌లా ప‌ట్టేస్తున్నాడు. అంతేకాదు ఆ మూవీని ఇరుగు పొరుగు భాష‌ల్లో రీమేక్ లు చేసి హిట్లు కొట్టేస్తున్నాడు. హిందీ సినిమాల్ని తెలుగు త‌మిళం మ‌ల‌యాళంలోనూ రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి డబ్బు సంచికెత్తుకుంటున్నాడు.

ఇంత‌కీ ఎవ‌రీ నిర్మాత‌? అంటారా? ఇంకెవ‌రు.. ది గ్రేట్ బోనీ క‌పూర్. దివంగ‌త శ్రీ‌దేవి భ‌ర్త‌. స్టార్ హిందీ ప్రొడ్యూస‌ర్. ఇంత‌కుముందు హిందీలో బంప‌ర్ హిట్ కొట్టిన పింక్ చిత్రాన్ని త‌మిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఇప్పుడు తెలుగు లోనూ వ‌కీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. దిల్ రాజుతో క‌లిసి ఈ సినిమాని బోనీ నిర్మిస్తున్నారు. ఇక్క‌డా బంప‌ర్ హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు.

ఇదొక్క‌టే కాదు..అజిత్ తో బ‌హుభాషా చిత్రాల‌కు ప్లాన్ చేస్తున్నాడు. సౌత్ నార్త్ అనే విభేధం లేకుండా అన్నిచోట్లా పెట్టుబ‌డులు పెడుతూ ఆటాడేస్తున్నాడు. ఇదే కోవ‌లో మ‌ల‌యాళంలోనూ ఆయ‌న ఓ చెయ్యేస్తున్నారు. అక్క‌డ సీనియ‌ర్ బ్యూటీ మంజు వారియర్ నటించిన థ్రిల్ల‌ర్ మూవీ `ప్రతీ పూవంకోళి`(2019)కి రీమేక్ డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేశారు. అతని సంస్థ మలయాళం మినహా అన్ని భారతీయ భాషలకు రీమేక్ డబ్బింగ్ హక్కులను కలిగి ఉంది.

రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన చిత్ర‌మిది. ఈవ్ టీజింగ్ కి గుర‌య్యే వ‌స్త్ర వ్యాపారి అయిన‌ మహిళ చుట్టూ తిరిగే క‌థాంశ‌మిది. ఉన్ని ఆర్ చిట్టి కథల‌ సంకల‌నం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని హిందీలో లేదా మరే ఇతర దక్షిణ భారత భాషలో రీమేక్ చేస్తారా అంటే దానికి ఇంకా ఆన్స‌ర్ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రోషన్ కూడా ఇందులో విలన్ పాత్ర పోషించాడు. 2019 లో థియేటర్లలో విడుదలైన‌ ఈ చిత్రానికి విమర్శకులు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్ ను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ఇదివ‌ర‌కూ వార్తలు వచ్చాయి. కుమార్తె జాన్వి కపూర్ టైటిర్ పాత్రలో నటించ‌నుంది. తాజాగా మంజు వారియ‌ర్ మూవీ రైట్స్ ఆయ‌న ఛేజిక్కించుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News