సౌత్‌ పై జాన్వీ చిన్న చూపుపై ఫాదర్‌ కామెంట్స్‌

Update: 2019-08-26 16:14 GMT
అతిలోక సుందరి శ్రీదేవికి తెలుగు తమిళంలో ఏ స్థాయిలో అభిమానులుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌ లో కెరీర్‌ ఆరంభించి బాలీవుడ్‌ కు వెళ్లి అక్కడ టాప్‌ స్టార్‌ గా పేరు దక్కించుకుంది. ఆ కారణంగా శ్రీదేవికి చివరి రోజుల వరకు కూడా సౌత్‌ ఇండస్ట్రీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే సౌత్‌ లో నటించేందుకు ఆసక్తి చూపించింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తర్వాత తమిళ చిత్రంలో శ్రీదేవి నటించింది. ఆమె మరణం తర్వాత ఆమె వారసత్వంను పుణికి పుచ్చుకుని ఆమె లేని లోటును జాన్వీ కపూర్‌ తీర్చుతుందని అంతా భావించారు. బాలీవుడ్‌ లో ధడక్‌ చిత్రంతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ మొదటి సినిమాతోనే నటిగా నిరూపించుకుంది.

అవకాశాలు వచ్చినా రాకున్నా కూడా బాలీవుడ్‌ లోనే ఉండాలని ఆమె భావిస్తుంది. తెలుగు మరియు తమిళం నుండి పలు ఆఫర్‌ లు ఆమె వద్దకు వెళ్లినా కూడా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎంతో మంది స్టార్‌ హీరోల కోసం నిర్మాతలు జాన్వీ కపూర్‌ ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. కాని ఏ ఒక్క సినిమాకు ఆమె ఓకే చెప్పలేదు. దాంతో జాన్వీ కపూర్‌ సౌత్‌ ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తుందని.. తెలుగు తమిళ సినిమాల మార్కెట్‌ తక్కువ అనే ఉద్దేశ్యంతో ఆమె హిందీ సినిమాలే చేసేందుకు ఆసక్తి చూపుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.

తాజాగా జాన్వీ కపూర్‌ పై వస్తున్న ఆరోపణలపై ఆమె ఫాదర్‌ బోణీ కపూర్‌ స్పందించాడు. నా భార్య సౌత్‌ లో నటించి బాలీవుడ్‌ కు వచ్చింది. సౌత్‌ లో మా కుటుంబంకు చాలా ఆప్తులు ఉన్నారు. కృష్ణ.. చిరంజీవి ఇంకా పలువురు స్టార్స్‌ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. నేను తమిళంలో ఒక సినిమా నిర్మించాను. ప్రస్తుతం మరో సినిమాను నిర్మించబోతున్నాను. అలాంటి మాకు సౌత్‌ పై ఎలాంటి చిన్న చూపు లేదు.

ఇక జాన్వీ సౌత్‌ సినిమా విషయానికి వస్తే ఇప్పటి వరకు తన వద్దకు వచ్చిన ఏ ఒక్క కథ కూడా ఆమెను మెప్పించలేక పోయాయి.  అందుకే ఆమె నటించేందుకు ఒప్పుకోలేదు. మంచి కథలతో వస్తే తప్పకుండా నటించేందుకు ఓకే చెప్తుందని బోణీ కపూర్‌ అన్నాడు. బాలీవుడ్‌.. 2.ఓ వంటి భారీ చిత్రాలను అందించిన సౌత్‌ ఇండస్ట్రీని చిన్న చూపుతో ఎలా చూస్తామని బోణీ కపూర్‌ క్లారిటీ ఇచ్చాడు. అయితే మంచి కథతో వెళ్తే జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ లేదా కోలీవుడ్‌ లో నటించేందుకు ఓకే చెప్పనుందన్నమాట.
Tags:    

Similar News