బోయపాటి .. బన్నీ కాంబినేషన్ డిమాండ్ మామూలుగా లేదే!

Update: 2021-11-06 09:36 GMT
తెలుగులో మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో బోయపాటి సిద్ధహస్తుడు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఆయన సినిమాలు సాగుతాయి. అయితే యాక్షన్ అంతా కూడా ఆ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందువలన ఆయన సినిమాలకి యూత్ .. మాస్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తుంటారు. బోయపాటి ఇంతవరకూ చేసినది 8 సినిమాలే. వాటిలో 4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు. అలాంటి హిట్లలో అల్లు అర్జున్ తో చేసిన 'సరైనోడు' సినిమా కూడా ఒకటిగా చెప్పుకోవాలి.

అల్లు అర్జున్ హీరోగా 2016లో వచ్చిన 'సరైనోడు' సినిమాతో, యాక్షన్ పరంగా అల్లు అర్జున్ లోని కొత్త కోణాన్ని బోయపాటి ఆవిష్కరించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది. అందువలన ఇప్పుడు గీతా ఆర్ట్స్ వారు మళ్లీ అల్లు అర్జున్ తో చేయడానికి బోయపాటికి ఛాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన కథ చెప్పేయడం .. అల్లు అరవింద్ వినేయడం .. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయి. రేపో మాపో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. అందువలన సెట్స్ పైకి వెళ్లకముందే ఈ సినిమాపై అంచనాలు బయల్దేరిపోతున్నాయి. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల కోసం అప్పుడే పోటీ మొదలైపోయింది అంటున్నారు. 60 కోట్ల నాన్ థియేట్రికల్ ఆఫర్ వచ్చినట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ కి గల పేరు .. బన్నీ - బోయపాటి కాంబినేషన్ కి గల క్రేజ్ .. హిందీ అనువాద సినిమాల్లో బన్నీ సినిమాలకు ఉన్న ఆదరణ కారణంగా ఈ స్థాయి పోటీ కనిపిస్తోందని అంటున్నారు.

ప్రస్తుతం బోయపాటి .. బాలకృష్ణతో చేసిన 'అఖండ' సినిమాకి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగును పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాతో బాలకృష్ణతో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో బోయపాటి ఉన్నాడు. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తరువాత బన్నీతో కలిసి బోయపాటి సెట్స్ పైకి వెళతాడు. బాలకృష్ణ తరువాత బోయపాటి రిపీట్ చేసిన హీరో బన్నీనే.


Tags:    

Similar News