తారక్ గురించి బ్రహ్మాజీ చెప్పిన నిజాలు

Update: 2016-08-13 06:11 GMT
జనతా గ్యారేజ్ ఆడియో వేడుకలో చాలామంది అతిథులు మాట్లాడారు. అందులో బ్రహ్మాజీ స్పీచ్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ తో తన అనుభవాల గురించి అభిమానులు ఉప్పొంగిపోయేలా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు బ్రహ్మాజీ. అతనేమన్నాడంటే..

‘‘ఎన్టీఆర్ ను చూసి ఏదో అనుకుంటాం. కానీ అతను మామూలువాడు కాడు. మేం అతణ్ని గూగుల్ అని పిలుచుకుంటాం. ఎందుకంటే అతడి దగ్గర ఏ సమాచారమైనా ఉంటుంది. కార్ల గురించి మాట్లాడినా.. జంతువుల గురించి చర్చించినా.. ఇంకా బాడీ డైట్.. ఇంకా ఏ విషయమైనా సరే.. మేం సమాచారం కావాలంటే గూగుల్ చూస్తాం. అతను మాత్రం ఇట్టే చెప్పేస్తాడు. 70ల్లో వచ్చిన ఓ పాట గురించి మాట్లాడితే.. ఆ పాట పుట్టు పూర్వోత్తరాలు చెబుతూ పాడి వినిపిస్తాడు.

ఇక సినిమా విషయానికి వస్తే.. మాతో మాట్లాడుతున్నట్లే ముచ్చట్లు చెబుతున్నట్లే ఉంటాడు. అవతల ఫైట్ రిహార్సల్స్ జరుగుతుంటాయి. ఒక కంటితో అలా చూస్తుంటాడు. టేక్ అనగానే వెళ్లి ఒక్క టేక్ లో పని పూర్తి చేసి వచ్చేస్తాడు. ఫైట్లు కదా.. అందులో ప్రావీణ్యం ఉందేమోలే అనుకుంటాం. ఆ తర్వాత పాట తీస్తుంటారు. మాతో మాట్లాడుతున్నట్లే ఉంటాడు. మధ్యలో వెళ్లి దడదడలాడించేసి వచ్చేస్తాడు. డ్యాన్స్ లో కూడా స్పెషల్ టాలెంట్ ఉందిలే అనుకుంటాం. కానీ తర్వాత ఓ సన్నివేశం చేయాల్సి ఉంటుంది. ఐదు పేజీల డైలాగ్ ఇస్తారు. ఒకసారి చూసుకుని వెళ్లి బ్రేక్ లేకుండా దడదడలాడించేసి వచ్చేస్తాడు. చాలాసార్లు ఆశ్చర్యపోయాను. పెద్దాయన ఎన్టీఆర్ ఆశీస్సులు అతడికి ఉన్నాయి’’ అని బ్రహ్మాజీ చెబుతుంటే ఎన్టీఆర్ అభిమానుల ఉత్సాహం అంతా ఇంతా కాదు.
Tags:    

Similar News