కమెడియన్స్ లేకపోయినా కామెడీని ఉంచండి: బ్రహ్మీ

Update: 2022-06-04 14:30 GMT
వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్ 3' సినిమా క్రితం నెల 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్లో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేయడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ఇంకా ప్రమోషన్స్  కొనసాగిస్తూనే  ఉండటం విశేషం. ఈ సారి వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. అనిల్ రావిపూడిలను బ్రహ్మానందం ఇంటర్వ్యూ చేశారు.

"నేను చాలా యంగ్ .. నన్ను చూసి మా అబ్బాయి అనుకున్నారు కదూ అంటూనే బ్రహ్మానందం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 'చంటి' సినిమాలో తాను పోషించిన రేచీకటి పాత్రను 'ఎఫ్ 3'లో వెంకటేష్ గారితో చేయించారనీ,  ఆయనేమో తనకంటే బాగా చేశారని బ్రహ్మానందం క్లిప్పింగ్ వేసి మరీ చూపించారు.

ఆ పాత్ర  చేసేటప్పుడు తనకి ఒకసారి చెప్పాల్సిన అవసరం లేదా అంటూ అసహనాన్ని  ప్రదర్శించారు. ఇక వరుణ్ తేజ్ చేసిన 'నత్తి' పాత్రను .. ఆల్రెడీ తాను 'అహ నా పెళ్లంట' సినిమాలో చేశానని చెబుతూ అది కూడా క్లిప్పింగ్ వేసి మరీ చూపించారు.

గతంలో తాను చేసిన పాత్రలే అయినా కొత్తగా .. చాలా బాగా చేశారని వాళ్లిద్దరినీ  బ్రహ్మానందం అభినందించారు. అయితే  ఆయన స్ఫూర్తితోనే తాము చేయగలిగామని వెంకటేశ్ .. వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. వెంకటేశ్ గారికి కామెడీ అనేది కొట్టిన పిండి .. ఆయన ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు.

ఇక వరుణ్ తేజ్ ఎక్కువగా మాట్లాడడు .. అలాంటి ఆయనతో కామెడీ చేయించారు .. పైగా దానికి నత్తిని తగిలించారు .. పాపం వాడిని చాలా హింస పెట్టరయ్యా. కామెడీ బాగా రావాలంటే అవతల ఆర్టిస్ట్ కూడా దానిని బ్యాలెన్స్ చేస్తూ రావాలి. అలా  వెంకీ .. వరుణ్  లాక్కొచ్చేశారు. వాళ్లిద్దరూ నన్ను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పడం వాళ్ల సంస్కారం.

అప్పట్లో కమెడియన్స్ అంతా ఎవరికీ వాళ్లం బాగా చేసి .. డైరెక్టర్ తో శభాష్ అనిపించుకోవాలని చూసేవాళ్లం. మన తెలుగులో ఉన్నంత మంది కమెడియన్స్ మరెక్కడా లేరేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది.  కమెడియన్స్ లేకపోయినా ఫరవాలేదు గానీ .. సినిమాలో కామెడీ ఉంచండి. నవ్వుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. కమెడియన్స్ కామెడీ చేయడంలో ఆశ్చర్యం లేదు .. కానీ  కామెడీ విషయంలో వెంకటేశ్ గారు మాతో పోటీపడేవారు. 'అబ్బాయిగారు' .. ' నమో వెంకటేశ .. ఇలా ఎన్నో సినిమాలు .. " అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News