సోదరుడి సినిమాకు బన్నీ సపోర్ట్ లేదేంటి..?

Update: 2022-11-03 16:44 GMT
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. 'కొత్త జంట' 'ఒక్క క్షణం' 'శ్రీరస్తు శుభమస్తు' వంటి చిత్రాలతో మెప్పించిన యంగ్ హీరో.. ఇప్పుడు ''ఊర్వశివో రాక్షసివో'' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ''ఊర్వశివో రాక్షసివో'' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడంతో.. అల్లువారబ్బాయి ఈసారి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే తమ్ముడి సిననిమాకి బన్నీ సపోర్ట్ చేయకపోవడడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'ఊర్వశివో..' మూవీ గురించి అల్లు అర్జున్ ఇంతవరకూ కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. టీజర్ లేదా ట్రైలర్ ను లాంచ్ చేసి తన మద్దతు తెలుపలేదు. ఇప్పుడు విడుదలకు ముందు కూడా తన బెస్ట్ విషెస్ ను అందించకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అల్లు శిరీష్ 'ఏబీసీడీ' వంటి ప్లాప్ తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ''ఊర్వశివో రాక్షసివో''. ఇది హిట్టవ్వడం హీరో కెరీర్ కు ఎంతో కీలకం. అందుకే ప్రమోషన్స్ ను ఒక్కడే తన భుజాల మీద వేసుకొని చేస్తూ వచ్చాడు. అతనికి పాన్ ఇండియా స్టార్ బన్నీ కూడా మద్దతుగా నిలిస్తే సినిమా చుట్టూ బజ్ వేరేలా ఉంటుంది. కానీ అలా జరగలేదు.

మరోవైపు నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చి శిరీష్ కు తనవంతు సపోర్ట్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసి విషెస్ అందజేశాడు. కానీ సొంత అన్న బన్నీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని అందరూ ఆలోచిస్తున్నారు. ఇతర చిన్న మీడియం రేంజ్ హీరోలను ప్రమోట్ చేస్తూ.. శిరీష్ ను ఎందుకు పట్టించుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి శిరీష్ డెబ్యూ మూవీ 'గౌరవం' నుంచి లాక్ డౌన్ లో చేసిన హిందీ మ్యూజిక్ వీడియో వరకూ ప్రతీ విషయంలోనూ అల్లు అర్జున్ తన తమ్ముడికి సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు. కానీ ఈ ఒక్క సినిమాకే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అందుకే ఇదీ ఒక టాపిక్ అయింది.

అయితే శిరీష్ కు బన్నీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అల్లు అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రాన తమ్ముడి సినిమాని విస్మరించినట్లు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఐకాన్ స్టార్ బ్రదర్ అనే బ్రాండ్ జనాలను థియేటర్లకు రప్పిస్తుందని పేర్కొంటున్నారు.

అందులోనూ 'ఊర్వశివో రాక్షశివో' సినిమా సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన సినిమా కావడంతో.. తన టీమ్ అంతా దగ్గరుండి చూసుకున్నారని.. పెద్దగా బన్నీ అవసరం రాలేదని అంటున్నారు. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదని.. సినిమా హిట్టయితే సక్సెస్ సెలబ్రేషన్స్ కు కచ్చితంగా వస్తాడని అల్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News