హీరోగా బన్నీని భరించడం కష్టమే: అల్లు బాబీ

Update: 2022-03-31 15:30 GMT
అల్లు అరవింద్ .. సినిమాల నిర్మాణం విషయంలో ఆయనకి ఉన్న అనుభవం అపారం. ఏ కథ ఏ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఏ కథలో ఎప్పుడు ఏ విషయం చెబితే బాగుంటుంది.  ఎక్కడి వరకూ ఆ విషయన్ని దాస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేది ఆయనకి బాగా తెలుసు. అలాగే ఏ కథను ఏ హీరోతో చేస్తే బాగుంటుంది ..  ఏ పాత్రలో ఏ ఆర్టిస్ట్ సరిగ్గా ఒదిగిపోతాడు .. ఏ కథకు ఎంతవరకూ ఖర్చు చేయవచ్చు అనే విషయంలో ఆయనకి మంచి అవగాహన ఉంది. అందువల్లనే ఆయన అన్ని సక్సెస్ లను చూడగలిగారు.

అలాంటి ఆయన వారసులుగా ఇండస్ట్రీకి అల్లు బాబీ .. అల్లు అర్జున్ .. అల్లు శిరీష్ వచ్చారు. అల్లు అర్జున్ హీరోగా స్టార్ డమ్ ను అందుకున్నాడు. ఇక శిరీష్ ఒక్కో మెట్టు ఎక్కడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇంతవరకూ తండ్రి వెంటే ఉంటూ నిర్మాణ సంబంధమైన వ్యవహారాలను చూసుకుంటూ వచ్చిన అల్లు బాబీ, పొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని 'గని' సినిమాతో నిర్మాతగా మారిపోయాడు. వరుణ్ తేజ్ హీరోగా నిర్మితమైన ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయనున్నారు.

అల్లు బాబీ నిర్మాతగా మారిపోయాడు కనుక, తమ్ముడైన అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ తప్పకుండా ఉంటుందని అనుకోవడం సహజం. తాజా ఇంటర్వ్యూలో అల్లు బాబీకి ఇదే ప్రశ్న ఎదురైతే, అదంత తేలికైన విషయం కాదని తేల్చిపారే శాడు.

"అల్లు అర్జున్ నా తమ్ముడే కావొచ్చు .. కానీ తను ఇప్పుడు స్టార్ హీరో. ఆయనతో సినిమా చేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. నేను ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని సొంతంగా సినిమాలు చేసుకుంటున్నాను. అందువలన ఇప్పట్లో తనతో  సినిమా చేయడం కష్టమే.

 ఇక తనతో సినిమా చేయాలంటే ముందుగా మంచి కథను సెట్ చేసుకోవాలి. అలాంటి ఒక కథను వెతికి పట్టుకోవడం కూడా  అంత ఈజీ ఏమీ కాదు. అలాంటి కథతో ఎవరైనా నా దగ్గరికి వస్తే, నేను నిర్మించకపోయినా ప్రెజెంట్ చేస్తాను.

ఇక నేను ఈ బ్యానర్లో గీతా ఆర్ట్స్ మాదిరిగా వరుస సినిమాలు చేయాలనుకోవడం లేదు. నాకు బాగా నచ్చిన కథ నా దగ్గరికి వచ్చినప్పుడు, ఈ కథను తప్పకుండా చేయవలసిందే అని బలంగా అనిపించినప్పుడు మాత్రమే అందుకు  పూనుకుంటాను" అని చెప్పుకొచ్చాడు. మరి 'గని' సినిమాతో నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే అల్లు బాబీ హిట్ కొడతాడేమో చూడాలి.
Tags:    

Similar News