బావమరిదికి సపోర్ట్ గా నిలుస్తున్న బన్నీ..!

Update: 2022-10-04 03:58 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్‌ ముత్తంశెట్టి ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చాన్నాళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే బావమరిది ని జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత బన్నీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అల్లు హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు విరాన్. ఇదే క్రమంలో 'బతుకు బస్టాండ్' అనే సినిమాతో విరాన్ ను హీరోగా లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా గతేడాది సమ్మర్ లోనే రిలీజ్ కు రెడీ అయింది.

ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ - సాంగ్స్ - ట్రైలర్ అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సందడి చేశారు. కానీ ఏమైందో తెలియదు.. ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు 'బతుకు బస్టాండ్' బయటకు రాలేదు. ఆ మధ్య డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. నిజం కాలేదు.

అల్లు కాంపౌండ్ హీరో విరాన్ డెబ్యూ సినిమాని అందరూ మర్చిపోయే పరిస్థితి ఏర్పడిన తరుణంలో.. ఇప్పుడు అతను అల్లు అర్జున్ తో కలిసి కమర్షియల్ యాడ్ షూటింగ్ లో పాల్గొని వార్తల్లో నిలిచాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జోమాటో ప్రకటనలో బన్నీతో కలిసి నటించడానికి విరాన్ కు అవకాశం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో విరాన్ ముతంశెట్టి ఇన్స్టాగ్రామ్ వేదికగా బన్నీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. ''థాంక్యూ అనేది చాలా చిన్న పదం అవుతుంది. లవ్ యూ అల్లు అర్జున్ గారు.. ఈ అవకాశం ఇచ్చినందుకు.. కలలు సాకారం చేసినందుకు.. లవ్ యూ లవ్ లవ్ బన్నీ బావ. మీతో కమర్షియల్ యాడ్‌ లో నటించడం కంటే ఇంకా ఏం కావాలి. నా సోదరుడు శరత్‌ చంద్ర నాయుడుకి చాలా స్పెషల్ థాంక్స్.. వాట్ ఏ డే.. త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించగా.. వినోద్ గారు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అల్లు అర్జున్ గారితో కలిసి నటిస్తున్నాను. 3.10.2022. ఆ యాడ్ కోసం వేచి ఉండండి'' అని పేర్కొన్నాడు.

మేనమామ కొడుకైన విరాన్ కు అల్లు అర్జున్ తనవంతు మద్దతును అందిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే తన మేనమామలు స్థాపించిన ముత్తంశెట్టి మీడియా సంస్థను 'పుష్ప' నిర్మాణంలో భాగస్వాములుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇదంతా చూస్తుంటే బన్నీ తన అమ్మ తరపు ఫ్యామిలీ మెంబర్స్ కు ఇండస్ట్రీలో సపోర్ట్ గా నిలుస్తున్నాడని అర్థమవుతోంది.

మెగా హీరోలలో ఒకరిగా స్టైలిష్ స్టార్ గా పిలవబడిన అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్‌ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు 'అల్లు' బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో సరైన ప్రణాళికతో ఉన్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల తన తాత దివంగత అల్లు రామలింగయ్య 100వ జయంతి వేడుకల్లో భాగంగా 'అల్లు స్టూడియోస్' ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఆర్మీకి విడివిడిగా ధన్యవాదాలు తెలిపారు.

ఇదంతా 'అల్లు' బ్రాండ్ ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే జరుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు తన బ్రాండ్ తోనే మేనమామ తనయుడు విరాన్ ముత్తంశెట్టిని కమర్షియల్ యాడ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు.

ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్ట పడుతుండగా.. అల్లు బాబీ ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ మాదిరిగానే.. ఇండస్ట్రీలో అల్లు కాంపౌండ్ అనే ప్రత్యేకమైన బ్రాండ్ తో పిలవబడతారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News