బాలీవుడ్ వైపు చూపు మళ్లిస్తున్న బన్నీ..!

Update: 2021-11-19 09:52 GMT
'అల వైకుంఠపురములో' సినిమాతో ఘనవిజయం సాధించిన అల్లు అర్జున్.. ఇప్పుడు 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోకస్ పెట్టారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు హిందీలో ప్రమోషన్స్ చేయలేదు. దీనికి కారణం ఈ సినిమా అసలు బాలీవుడ్ లో థియేట్రికల్ రిలీజ్ అవుతుందా లేదా అనే దాని మీద క్లారిటీ లేకపోవడమే.

అయితే ఎట్టకేలకు 'పుష్ప: ది రైజ్' సినిమా హిందీ రిలీజ్ కు మార్గం సుగమం అయింది. గోల్డ్‌ మైన్ ఫిలిమ్స్ వారితో మేకర్స్ జరిపిన చర్చలు ఫలించడంతో ఇరు వర్గాల మధ్య డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హిందీలో కూడా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' అనే నాలుగో పాట హిందీ వెర్షన్ లిరికల్ వీడియోని కూడా వదిలారు. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నార్త్ ఆడియన్స్ ని అలరిస్తోంది.

'పుష్ప' సినిమా విడుదలకు గట్టిగా నెల రోజుల టైం కూడా లేకపోవడంతో.. ఇకపై హిందీ ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేసి, ముందుగా అక్కడే ట్రైలర్ ను ప్రదర్శించాలనుకుంటున్నారట. అంతేకాదు బన్నీ ఓ వారం రోజుల పాటు ముంబయిలోనే ఉండి అక్కడి ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనుకుంటున్నారట. అలానే పలు హిందీ టీవీ కార్యక్రమాలకు హాజరు కానున్నారని టాక్ నడుస్తోంది.

'పుష్ప' సినిమా మీదకు ఉత్తరాది జనాల దృష్టిని మళ్లించేందుకు అల్లు అర్జున్ మరియు చిత్ర నిర్మాతలు నియమించిన పీఆర్ టీమ్ ఇప్పటికే భారీ ప్లాన్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమాకు అతి పెద్ద మార్కెట్ గా భావించే బాలీవుడ్ కీలకం కాబట్టి.. గట్టిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులోనూ 'పుష్ప' లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు దర్శకుడు బాలీవుడ్‌ లో ఫేమ్ లేని వారు కావడం వల్ల ప్రమోషన్స్ ద్వారానే ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది.

అందుకే 'పుష్ప' టీమ్ గట్టిగా ప్రచార కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరి బన్నీ కి పుష్ప ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News