16 ఏళ్ళ తర్వాత కుదిరిన కాంబో

Update: 2018-04-23 07:02 GMT
2002లో బాలకృష్ణ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఒక సెన్సేషన్. బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల్లో బెస్ట్ అనిపించుకోకపోయినా కమర్షియల్ గా భారీ వసూళ్లు రాబట్టి ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. తర్వాత మళ్ళి ఆ కాంబోలో సినిమా కుదరలేదు. ఇన్నాళ్ళకు బాలయ్య వినాయక్ మరోసారి జట్టు కడుతున్నారు. జైసింహతో కమర్షియల్ సక్సెస్ సాధించిన సి. కళ్యాణ్ నిర్మాతగా బాలకృష్ణ హీరోగా రూపొందే సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మేరకు కళ్యాణ్ నిన్న చిలకలూరిపేటలో జరిగిన జైసింహ వంద రోజుల వేడుకలో ధృవీకరించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ మూవీని ఆగస్ట్ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జైసింహ తరహాలోనే షూటింగ్ త్వరగా పూర్తి చేసి 2019 సంక్రాంతి రేసులో నిలబెట్టాలని కళ్యాణ్ ప్లానింగ్ అని తెలుస్తోంది.

ఇప్పటికే తేజ దర్శకత్వం ప్రారంభమైన ఎన్టీఆర్ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుపెట్టనుండగా రిలీజ్ దసరాకే టార్గెట్ చేసారు. ఎప్పటిలాగే షూటింగ్ వేగంగా జరిగేలా బాలకృష్ణ ఈ రెండు సినిమాల పట్ల పూర్తి క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక వినాయక్ విషయానికి వస్తే తనను తాను మళ్ళి ప్రూవ్ చేసుకునే క్లిష్టమైన దశలో వచ్చిన ఆఫర్ గా చెప్పొచ్చు. ఇటీవలే వచ్చిన ఇంటెలిజెంట్ వినాయక్ లోని అడుగంటిపోయిన క్రియేటివిటీని ఎత్తి చూపగా అంతకు ముందు తీసిన ఖైది నెంబర్ 150 రీమేక్ కావడం క్రెడిట్ మొత్తం చిరు తీసుకోవడం లాంటి కారణాల దృష్ట్యా కొత్త కథతో వినాయక్ కం బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. మాస్ హీరోయిజంను పండించడంలో మాస్టర్ అయిన వినాయక్ బాలయ్యను ఈసారి ఎలా చూపిస్తాడో వేచి చూడాలి.
Tags:    

Similar News