తన చుట్టూ ఉన్న ఆడాళ్లకు పడిపోతానన్న నిర్మాత
ఏబీపీ లైవ్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో బోనీ కపూర్ దివంగత భార్య శ్రీదేవిని తాను ఎప్పుడూ మోసం చేయలేదని చెప్పాడు.
దుబాయ్‌లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో బాత్ టబ్‌లో కాలు జారిపడి మరణించిందని నటి శ్రీదేవి గురించి పోలీస్ రిపోర్ట్ వచ్చింది. కానీ దానిని అభిమానులు ఎవరూ నమ్మలేదు. ఓ పెళ్లి కోసం వెళ్లి శ్రీదేవి అనంత లోకాలకు తిరిగి వెళ్లారు. దీంతో ఈ మరణంపై చాలా సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. లెజెండరీ నటి శ్రీదేవి మరణించడంతో కుమార్తెలు జాన్వీ, ఖుషి వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయారు. తీవ్ర గందరగోళానికి గురయ్యారు. శ్రీదేవి మరణం ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్ కి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చింది.
అదంతా అటుంచితే శ్రీదేవిని బోనీకపూర్ ఏడేళ్ల పాటు ప్రేమించి చివరికి వివాహం చేసుకున్నారు. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న అతడితో ప్రేమకు మొదట శ్రీదేవి నో చెప్పారు. చాలా కాలం పాటు అతడిని దూరంగా ఉంచింది శ్రీదేవి. కానీ అతడు పదే పదే వెంటపడ్డాడు. చివరకు శ్రీదేవి అప్పటి తన పరిస్థితుల కారణంగా నిర్మాత బోనీ కపూర్ ప్రేమకు ఓకే చెప్పింది. కానీ శ్రీదేవిని పెళ్లాడాక బోనీకి మొదటి భార్యతో కలతలు చెలరేగాయి. అది తీరని అగాధానికి తెర తీసింది.
బోనీ 1983లో టీవీ, మూవీ నిర్మాత మోనా శౌరీని వివాహం చేసుకున్నారు. వారికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. భార్య పిల్లలు ఉన్నా బోనీకపూర్ 1996లో శ్రీదేవిని పెళ్లాడాడు. అదే కారణంగా అతడు తన భార్య మోనా నుంచి విడిపోయాడు. ఏబీపీ లైవ్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో బోనీ కపూర్ దివంగత భార్య శ్రీదేవిని తాను ఎప్పుడూ మోసం చేయలేదని చెప్పాడు. అతడు ఆమెను అత్యంత ఆకర్షణీయమైన అందగత్తె అని, గొప్ప వ్యక్తిత్వం ఉన్న భార్య అని ప్రశంసించాడు. శ్రీదేవిని ఎప్పుడూ తాను మోసం చేయలేదని, తన సర్వస్వం అని అన్నాడు. శ్రీదేవి దక్షిణాదికి చెందిన అమ్మాయి అయితే తాను పంజాబీ మూలాలున్న వాడిని అని బోనీ గుర్తు చేసాడు. పెళ్లయ్యేప్పటికే ఏడేళ్ల ప్రేమాయణంలో తమ మధ్య చాలా అనుబంధం ఏర్పడిందని కూడా అన్నాడు. చాలా కాలం ప్రయాణంలో ఒకరికొకరు చాలా అర్థం చేసుకున్నామని తెలిపాడు.
ఇతర మహిళల విషయంలో ఆకర్షితుడైనప్పటికీ శ్రీదేవిపై తనకున్న ప్రేమ ఎప్పటికీ చావదని బోనీ కపూర్ చెప్పారు. బోనీ కపూర్ 2018లో తన డ్రీమ్ గాళ్ శ్రీదేవికి విచారంగా వీడ్కోలు పలికాల్సొచ్చింది. శ్రీదేవి లేకపోయినా నాటి ప్రేమ ఈనాటికీ బలంగా ఉందని తెలిపాడు. తాను ఇతర మహిళలకు ఆకర్షితుడైనా కానీ, శ్రీదేవిపై తనకున్న ప్రేమ ముందు ఏదీ నిలవలేదని బోనీ చెప్పాడు. ``నాకు మహిళా స్నేహితులు ఉండవచ్చు.. నా చుట్టూ ఉన్న ఆడవారి పట్ల నేను ఆకర్షితుడవుతాను.. కానీ ఆమెకు సంబంధించినంతవరకు అభిరుచి ప్రేమ ఎప్పటికీ పోవు`` అని బోనీ అన్నారు.