మోహన్‌లాల్ 'బరోజ్ 3D' మెప్పించిందా..?
'బరోజ్ 3D' కథేంటంటే: గోవాని పరిపాలించిన పోర్చుగీసు రాజు డి గామాకి నమ్మిన బంటు అయిన బరోజ్(మోహన్ లాల్).
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''బరోజ్ 3D''. ఎన్నో అద్భుతమైన సినిమాలతో గత కొన్నేళ్లుగా సినీ అభిమానులను అలరించిన కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టడంతో మొదటి నుంచే ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ వివిధ కారణాలతో ఆలస్యమై, ఎట్టకేలకు క్రిస్మస్ స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో టాక్ ని బట్టి తెలుసుకుందాం.
'బరోజ్ 3D' కథేంటంటే: గోవాని పరిపాలించిన పోర్చుగీసు రాజు డి గామాకి నమ్మిన బంటు అయిన బరోజ్(మోహన్ లాల్). గామా వంశానికి చెందిన నిధిని 400 సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్న బరోజ్.. నిజమైన గామా వారసులకు ఆ నిధిని అప్పగించాలని ఎదురు చూస్తుంటాడు. ఆ వంశంలో 13వ తరానికి చెందిన ఇసబెల్లా(మాయా రావు) తన తండ్రితో కలిసి గోవా వస్తుంది. అయితే ఇసబెల్లా ఆ వంశానికి చెందినదా కదా అనేది బరోజ్ ఎలా తెలుసుకుంటాడు? ఆమెకి నిధిని అప్పగించాడా లేదా? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు నాలుగు దశాబ్దాలపాటు ఆ నిధిని బరోజ్ ఎలా కాపాడుతూ వచ్చాడు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇటీవల కాలంలో ఇండియన్ ఫిలిం మేకర్స్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాలు తీస్తున్నారు. సైన్స్ ఫిక్షన్స్, ఫాంటసీ, జానపద, పురాణ కథలను తెర మీదకు తీసుకొస్తూ ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచుకుంటున్నారు. ఇప్పుడు 'బరోజ్ 3D' మూవీతో మోహన్ లాల్ అలాంటి ప్రయత్నమే చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమాని భారతీయ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా, మన నేటివిటీకి తగ్గట్లుగా తీయలేదనే టాక్ వినిపిస్తోంది. పోర్చుగీసు పాత్రలు, పోర్చుగీసు పాటలు, డైలాగ్స్.. ఇలా ప్రతీది ఏదో ఫారిన్ లాంగ్వేజ్ సినిమాని చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించింది.
విధేయత, త్యాగం, వారసత్వం ఇతివృత్తాలతో 'బరోజ్' కథ రాసుకున్నారు. అయితే ఆ కథను చెప్పిన విధానం కొత్తగా లేదు. మన ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే పాత్రలు, నేపథ్యం ఈ సినిమాలో మిస్ అయ్యాయని అంటున్నారు. అసలు ఎమోషన్స్ పండకపోవడం ప్రధాన లోపంగా చెబుతున్నారు. త్రీడీ విజువల్స్‌పై దృష్టి పెట్టారు కానీ, కథ కథనంపై ఫోకస్ చేసినట్లుగా అనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. త్రీడీ విజువల్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయట. అలానే క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, సినిమాని ముగించిన తీరు ప్లస్ పాయింట్స్ అంటున్నారు. సుమారు 3 గంటల నిడివి ఉండటం కూడా మైనస్ అయిందని పోస్టులు పెడుతున్నారు.
ఇక మోహన్ లాల్ పోషించిన బరోజ్ పాత్రను పోర్చుగీస్ వారి కట్టప్ప అనేలా డిజైన్ చేసారు. కానీ ఆ పాత్రను బలంగా తీర్చుదిద్దలేదు. దీంతో ఆయన నటన పరంగా కొత్తగా ఏమైనా చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కాకపోతే ఆయన లుక్ మాత్రం బాహుబలి కట్టప్ప తరహాలో కొత్తగా అనిపిస్తుంది. ఇసబెల్లా పాత్రలో మాయా రావు అలరించింది. టెక్నికల్ గా ఈ మూవీ రిచ్ గా ఉంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచింది. మార్క్ కిలియన్ అందించిన మ్యూజిక్ మాత్రం నిరాశ పరుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్ గా ''బరోజ్ 3D'' సినిమా ఏమంత ఆకట్టుకోలేదనే మాట వినిపిస్తోంది. త్రీడీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలను చిన్న పిల్లలు ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు.