మొన్న శంకర్..నేడు కమల్..ఏం జరుగుతోంది?

Update: 2020-03-02 11:49 GMT
ఇండియన్‌-2’ సెట్ లో  క్రేన్‌ ప్రమాదం వార్త కోలీవుడ్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని షూటింగ్‌ స్పాట్‌ లో ఫోకస్‌ లైట్లున్న భారీ క్రేన్‌ తెగి కింద పడటంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ - ఆర్ట్‌ అసిస్టెంట్‌ చంద్రన్‌ - ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ మధు దుర్మరణం చెందగా...మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో చిత్ర టీం షాక్ కు గురైంది. నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించిన భారీ క్రేన్ ను ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ చేపట్టిన సీబీసీఐడీ...చిత్ర దర్శకుడు శంకర్ ను విచారణ జరిపారు. తాజాగా, ఈ చిత్ర హీరో కమల్‌ హాసన్‌ విచారణకు హాజరుకావాలని సీబీసీఐడీ సమన్లు జారీ చేసింది. కేంద్ర ఆర్ధిక నేరవిభాగం కార్యా లయంలో మంగళవారం జరిగే విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని కమల్‌కు సమన్లు జారీ అయ్యాయి.

ఈ ఘటనపై నజరత్‌ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. షూటింగ్‌ స్పాట్‌ కు పోలీసులు వెళ్ళి పరిశీలన జరిపినప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్‌ లను చూసి దిగ్ర్భాంతి చెందారట. భారీ స్థాయిలో సెట్టింగ్‌ లు నిర్మించడానికి కార్పొరేషన్‌ - చెన్నై నగర పోలీసుల అనుమతి గాని - జిల్లా కలెక్టర్‌ నుంచి గానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసలు గుర్తించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీసీఐడీకి బదిలీ చేస్తూ గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 24న సెట్స్‌ నిర్మించిన కార్మికులు - క్రేన్‌ లను అద్దెకిచ్చినవారు సహా ఆరుగురిని వేర్వేరుగా విచారణ జరిపారు. ఎగ్మూరులో ఉన్న గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో శంకర్ విచారణకు హాజరయ్యారు. ఇక, తాజాగా కమల్ ను అధికారులు పలు విషయాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News