'దాదాసాహెబ్ ఫాల్కే'కు ఎంపికైన రజినీ కి ప్రముఖుల అభినందనలు..!

Update: 2021-04-01 14:30 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికిగానూ 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. భారతీయ సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్‌ ఫాల్కే రజినీకి దక్కడం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేస్తూ.. ''తరాలు మారినా చెరగని అభిమానం సంపాదించుకున్న వ్యక్తి, కఠోరంగా శ్రమించే అరుదైన వ్యక్తుల్లో ఒకరు. విభిన్నమైన పాత్రలు పోషించే అద్భుతమైన, మంచి మనస్సున వ్యక్తి.. ఆయనే శ్రీ రజినీకాంత్. తలైవాకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనకి నా అభినందనలు'' అని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రజినీ కి శుభాకాంక్షలు చెప్పారు. ''నా ప్రియమైన స్నేహితుడు రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటింనందుకు సంతోషంగా ఉంది. నిజంగా మీరు దీనికి అర్హులు. మీరు చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. హృదయపూర్వక అభినందనలు'' అని చిరు ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రజినీకి అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ''సినిమాకు మీరు అందించిన సహకారం అసమానమైనది. నిజంగా మీరు అందరికీ ఇన్స్పిరేషన్'' అని మహేష్ అన్నారు. కమల్ హాసన్ స్పందిస్తూ.. 'నా ప్రియ మిత్రుడు రజనీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. ఈ పురస్కారం ఆయనకు దక్కడం సంతోషంగా ఉంది'' అని ట్వీట్ చేసాడు. విక్టరీ వెంకటేష్ - పవన్ కళ్యాణ్ - మంచు మోహన్ బాబు - మోహన్ లాల్ - మంచు విష్ణు - సుధీర్ బాబు - నివేదా థామస్ - పా. రంజిత్ - లారెన్స్ తదితరులు రజనీకాంత్ కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలను తెలిపారు.

దాదాసాహెబ్ ఫాల్కే రావడంతో తన సినీ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ రజినీకాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ''సినిమా రంగంలో అత్యంత విలువైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. నాలోని నటుడ్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్‌, నా స్నేహితుడు రాజ్‌ బహదూర్‌ కు.. పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను యాక్టర్ ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్‌ కు.. ఈ రజనీకాంత్‌ ను పరిచయం చేసిన నా గురువు బాలచందర్‌ తోపాటు.. నాకు జీవితాన్ని ఇచ్చిన దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. రాజకీయ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు'' అని రజనీకాంత్ పేర్కొన్నారు.
Tags:    

Similar News