సెల‌బ్ సాయం తిత్లీకి చేరేదెలా?

Update: 2018-10-16 06:55 GMT
ప్ర‌కృతి వైప‌రీత్యాల వేళ టాలీవుడ్ సెల‌బ్రిటీలు స్పందించే తీరును ప్ర‌శంసించి తీరాల్సిందే. అది తెలుగు రాష్ట్రాలు అయినా లేదా ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో అయినా మ‌న‌వాళ్లు అంద‌రికంటే ముందుంటారు. ఈ విష‌యంలో మొన్న కేర‌ళ విల‌యం వేళ ఆ రాష్ట్ర మంత్రి వ‌ర్యులే చెప్పారు. వంద‌ల కోట్లు సంపాదించుకున్న‌ మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్లు పిల్లికి భిక్షం వేయ‌ని బాప‌తు! అని తిట్టేసిన స‌ద‌రు మంత్రి గారు, టాలీవుడ్ హీరోల్ని, న‌టుల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ మ‌న‌వాళ్ల‌ను పొగిడేశారు. మోహ‌న్‌లాల్ - మ‌మ్ముట్టి - దిలీప్ అంత‌టివాళ్ల‌కే ఇది సిగ్గు చేటు అయ్యింది. ప్ర‌భాస్ ని చూసి నేర్చుకోండి.. అన‌డంతో వీళ్లంద‌రికీ త‌ల కొట్టేసిన‌ట్ట‌య్యింది.

అప్ప‌ట్లో సునామీ వ‌చ్చిన‌ప్పుడు, లేదా చెన్న‌య్ వ‌ర‌ద‌ల్లో మునిగిపోయిన‌ప్పుడు మ‌న టాలీవుడ్ చేసిన సాయం చిన్న‌ది కాదు. వీట‌న్నిటికీ మించి కేర‌ళ‌కు సాయం చేశారు మ‌న హీరోలు-సెల‌బ్రిటీలు. అంత మంచి మ‌నసున్న మ‌న స్టార్లు ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం- ఉత్త‌రాంధ్ర‌ను ఊపేసిన `తిత్లీ-తుఫాన్‌` బాధితుల‌కు సాయానికి చేస్తున్న‌ది అంతంత మాత్ర‌మేన‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికి నెమ్మ‌దిగానే స్పంద‌న క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే బ‌డా స్టార్లు లక్ష‌ల్లో విరాళాలు ప్ర‌క‌టించారు. అయితే ఇలా ల‌క్ష‌ల‌న్నీ కోట్లుగా పోగై సీఎం రిలీఫ్ ఫండ్‌కి చేరుతుంటే వాటిని స‌వ్యంగానే బాధితుల‌కు అందిస్తున్నారా? అన్న కొత్త ప్ర‌శ్న తాజాగా ఉత్ప‌న్న‌మైంది.

స‌రిగ్గా ఇదే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వ్వ‌డం వ‌ల్ల‌నే ఇదివ‌ర‌కూ విశాల్, - రానా, - మంచు మ‌నోజ్ లాంటి హీరోలు నేరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి సేవ చేసేందుకు, అక్క‌డ అవ‌స‌రం ఏంటో తెలుసుకుని బాధితుల‌కు నేరుగా ఏదైనా ప్ర‌తిఫ‌లం అందించేందుకు ప్ర‌య‌త్నించారు. చిన్నా చిత‌కా, నిత్యావ‌స‌రాల్ని అందించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే సినిమావోళ్లు ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ఇస్తున్నా.. అవి బాధితుల‌కు చేర‌తాయా అంటే డౌటేన‌న్న‌ ఆవేద‌న సెల‌బ్రిటీల్లో వ్య‌క్తం అవుతోంది. హుద్ హుద్ టైమ్‌లో ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ఇచ్చారు మ‌న స్టార్లు. కానీ ఆ నిధిని వాస్త‌వంగానే బాధితుల‌కు చేర‌వేశారా? అంటూ అప్పట్లోనే రాజ‌కీయ నేత‌లు సైతం ప్ర‌శ్నించ‌డం చ‌ర్చకొచ్చింది. మా అసోసియేష‌న్, ఫిలింఛాంబ‌ర్ ఈవెంట్ల పేరుతో కోట్లు ఫండ్ రైజ్ చేసి సునామీ బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కి త‌ర‌లించారు. అయితే డ‌బ్బు కేవ‌లం సీఎం రిలీఫ్ ఫండ్‌కి చేరింది త‌ప్ప బాధితుల‌కు చేరిందే లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సునామీ వ‌ల్ల ఊళ్ల‌కు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. పొలాలు నీట మునిగాయి. ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా అర‌టితోట‌లు, వ‌రి, జీడి మామిడి, స‌పోటా విధ్వంశం అయినా.. అస‌లు వాస్త‌వ బాధితుల‌కు న‌ష్ట నివార‌ణ చేసింది శూన్యం అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రైతులు ఎవ‌రికీ ఏమీ ఇవ్వ‌లేదు..  ఒక్కో రైతు ల‌క్ష‌ల్లో పంట‌ న‌ష్ట‌పోతే.. వంద‌లు, 2వేలు, 3వేల ప‌రిహారం ఇచ్చి స‌రిపెట్టారు. న‌ష్టాన్ని స‌రిగా అంచ‌నా వేయ‌లేదు.. స‌రిగా ప‌రిహార‌మూ ఇవ్వ‌లేదు.. దీంతో ల‌బోదిబోమ‌న్న బాధితులకు ఏడుపే మిగిలింది.  టాలీవుడ్ నుంచి కోట్లు క‌లెక్ట‌యినా అదంతా వేస్ట్ అయ్యింద‌న్న ఆవేద‌న కొంద‌రిలో వినిపించింది. నేరుగా బాధితుల‌కే టాలీవుడ్ ఇచ్చి ఉంటే కొంత మేలు జ‌రిగేదన్న వాద‌నా వినిపించారు కొంద‌రైతే. సీఎం రిలీఫ్ ఫండ్ సేవ‌ల్లో నిజాయితీ ఎంత‌? అన్న‌ది అటుంచితే.. అస‌లు బాధితుల‌కు మేలు జ‌రిగేలా చేయ‌డానికి ఎలాంటి వ్య‌వ‌స్థ కావాలి? అన్న‌దానిపైనా టాలీవుడ్ సెల‌బ్రిటీల్లో ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు కుక్క‌లు మొరిగిన చందంగా కాకుండా బాధితుల‌కు స‌త్వ‌ర‌మే సాయం అందేలా చేయాల‌న్న వాద‌నా వినిపిస్తోంది.
Tags:    

Similar News