సెన్సార్ బోర్డ్ లోగోలో పంచ వ‌ర్ణాలు

Update: 2019-09-02 05:58 GMT
కొత్తొక వింత పాతొక రోత‌..! అయినా పాత ప‌ద్ధ‌తులు ఇంకా ఎన్నాళ్లు? ఇంకా పాత విధానాల్ని ప‌ట్టుకుని వేలాడితే ఎలా? ఇప్పుడు అంతా మారింది. సాంకేతిక‌త విస్త్ర‌తంగా అందుబాటులోకి వ‌చ్చింది. అందుకే కాలంతో పాటే మారాలి.  కొత్త‌ద‌నానికి స్వాగ‌తం ప‌లుకుతూ.. పాత విధానాల‌కు స్వ‌స్థి ప‌లికి ప్ర‌తిదీ అప్ డేట్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అది భూముల రిజిస్ట్రేష‌న్ .. ప‌రిపాల‌నా విధానాల‌కే కాదు.. వినోద రంగంలో సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్ సీ) నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు వ‌ర్తిస్తుంది. కేవ‌లం నిబంధ‌న‌ల వ‌ర‌కే కాదు.. సెన్సార్ బోర్డ్ పాత తుప్పు ప‌ట్టిన లోగోని వ‌దిలించుకోవాల్సిన టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ స్టిఫికేష‌న్ కొత్త లోగో డిజైన్ ని కేంద్ర స‌మాచార ప్ర‌సారాల శాఖ‌ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ముంబైలో లాంచ్ చేశారు. కొత్త లోగోలో పంచ వ‌ర్ణాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక‌పై రిలీజ్  చేసే ప్ర‌తి స‌ర్టిఫికెట్ పైనా ఈ కొత్త లోగోని ముద్రిస్తారు. అలాగే 1952 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియాలో రిలీజైన సినిమాల‌ను డిజిట‌లైజ్ చేయ‌నున్నారు. అంతేకాదు.. ప‌సుపు రంగులో సెన్సార్ రేటింగ్ ని ఇవ్వ‌నున్నారు. ఇక ఈ కొత్త డిజైన్ లో క్యూఆర్ కోడ్ ని కూడా ఉంచారు. దీనిని స్కాన్ చేస్తే వారి సినిమాల స‌మాచారం యాక్సెస్ అవుతుంది. సెన్సార్ బోర్డ్ ప్ర‌స్తుత‌ అధ్య‌క్షుడు ప్ర‌సూన్ జోషి సార‌థ్యంలో ఈ కొత్త లోగో డిజైన్ చేశారు. కొత్త డిజైన్ పై సినీవ‌ర్గాల్లో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

ఎన్నో విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్న అనంత‌రం సెన్సార్ సెంట్ర‌ల్ బోర్డ్ లో ఈ మార్పు చేర్పులు చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. తాజా లోగో లాంచ్ వేడుక‌లో అందాల క‌థానాయిక విద్యాబాల‌న్ స‌హా ప‌లువురు టాప్ బాలీవుడ్ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. ఇక ప్రాంతీయ సెన్సార్ బోర్డుల ప‌రిధిలో.. విచ్చ‌ల‌విడి శృంగారం.. శ్రుతిమించిన ఎక్స్ పోజింగ్ కి సెన్సార్ నియ‌మ‌నిబంధ‌నల మార్పు అంశంపైనా ప‌రిశీల‌న ఉంటుందేమో చూడాలి.


    

Tags:    

Similar News