5 గంటల పాటు దీపికా పై ప్రశ్నల వర్షం.. ఏం చెప్పిందంటే...?

Update: 2020-09-26 16:00 GMT
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నోటీసులు అందుకున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ రోజు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 9.48 గంటలకి ఎన్‌సీబీ ఆఫీస్ కు చేరుకున్న దీపికాను.. అధికారులు 5 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. నిన్న దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ ని ప్రశ్నించిన ఎన్‌సీబీ.. నేడు మరోసారి దీపికాతో కలిసి విచారించారు. వీరిద్దరి మధ్య నిషేధిత పదార్థాలపై జరిగిన వాట్సాప్ చాటింగ్‌ గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపికా కరిష్మాతో డ్రగ్ చాట్ చేసినట్లు ఒప్పుకుందని 'టైమ్స్ నౌ' ఛానల్ పేర్కొంది. అయితే ఎన్‌సీబీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసినట్లు.. దీపిక సమాధానాలు సంతృప్తికరంగా లేవని జాతీయ మీడియా వెల్లడించింది. అందులోనూ దీపికా - కరిష్మా ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా ఒకేరకమైన సమాధానాలకు ఎన్సీబీ అధికారులకు చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే ని మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

కాగా, దీపికా తన మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో 2017 అక్టోబర్ లో జరిపిన వాట్సాప్ ఛాట్ లో నిషేధిత 'మాల్' 'హ్యాష్' గురించి డిస్కస్ చేసినట్లు బయటపడటంతో వీరికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలను తెలుసుకునే నేపథ్యంలో ఎన్సీబీ విచారిస్తున్నారు. ఈ గ్రూప్ చాటింగ్ లో 'D'(దీపికా) మరియు 'K'(కరిష్మా) అనే ఇద్దరి మధ్య జరిగింది. 'టైమ్స్ నౌ' వెల్లడించిన 2017 అక్టోబర్ 28న జరిగిన చాటింగ్ ప్రకారం 'మాల్ ఉందా?' అని దీపికా అడుగగా.. 'ఇంట్లో ఉంది. కానీ నేను బాంద్రాలో ఉన్నాను' అని కరిష్మా రిప్లై ఇచ్చింది. 'నీకు కావాలంటే అమిత్ ని అడుగుతాను' అని మెసేజ్ చేసింది. దీనికి దీపికా 'ఎస్.. ప్లీజ్' అని సమాధానం ఇచ్చింది. కొద్ది సేపటికి 'అమిత్ దగ్గర ఉంది. అతను తీసుకొస్తున్నాడు' అని కరిష్మా చెప్పింది. 'హ్యాష్ నా?' 'వీడ్ వద్దు' అంటూ మెసేజ్ చేసింది. ఇప్పుడు ఈ వాట్సాప్ చాటింగ్ ఆధారంగానే దీపికా పై అభియోగాయాలు మోపినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News