నాకు చాలా సిగ్గు.. అంతకుమించి భయం!

Update: 2022-06-22 01:30 GMT
చాందినీ చౌదరి .. వెండితెరకి పరిచయమై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో ఆమె చేసిన సినిమాలు తక్కువేనని చెప్పాలి. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆమె, ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది. ' కలర్ ఫోటో' సినిమాతో కథానాయికగా మారింది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సమ్మతమే' సినిమా సిద్ధంగా ఉంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా ఆమె తన కెరియర్ కి సంబంధించిన ముచ్చట్లను పంచుకుంది.

"మాది వైజాగ్ .. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ .. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. సినిమాలు చూసి వచ్చిన తరువాత  హీరోలను ఇమిటేట్ చేసే దానిని. ఎక్కువగా రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేసేదానిని.

మొదటి నుంచి కూడా నాకు జనాలంటే భయం .. స్టేజ్ ఎక్కాలంటే టెన్షన్. ఎప్పుడైనా స్టేజ్ పై గ్రూప్ డాన్స్ చేయవలసి వస్తే, అందరికంటే వెనక్కి వెళ్లి ఎవరికీ కనిపించకుండా డాన్స్ చేసేదానిని. అలాంటి నేను సెవెంత్ క్లాస్  చదువుతుండగానే .. హీరోయిన్ ను అవుతానని మా అమ్మతో చెప్పాను. నాకున్న సిగ్గుకీ .. భయానికి మా అమ్మా ఆ విషయాన్ని లైట్ తీసుకుంది.

కలలు అందరికీ ఉంటాయి .. కానీ అవి కొంతమంది విషయంలోనే నిజమవుతాయి. మనకు బ్యాక్ గ్రౌండ్ లేదు .. నువ్వు ఫొటోలు పట్టుకుని స్టూడియోస్ చుట్టూ తిరగలేవు అంది. ఆ తరువాత నేను ఇంజనీరింగ్ కి వచ్చేసరికి నన్ను నేను స్క్రీన్ పై చూసుకోవలనే ఇష్టం పెరుగుతూపోయింది. 2011లో నేను .. రాజ్ తరుణ్ కలిసి షార్ట్  ఫిలిమ్స్ మొదలుపెట్టాము. ఆ తరువాత నుంచి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయాయ్యి. ఏదైనా సరే  ఫాస్టుగా .. ఈజీగా అయిపోవాలి, ఎక్కువగా కష్టపడకూడదనేది నా ఉద్దేశం.

ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నాకు సినిమా కష్టాలనేవి ఏమీ లేవు. నా పనిని నేను అంకితభావంతో చేస్తూ వెళ్లాను. అడుగడుగునా సినిమాపై ప్రేమ పెరుగుతూ వెళ్లిందే గానీ .. తగ్గలేదు. ఎప్పటికప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదానిని.

నా ఏడుపు బాగోలేదనే కామెంట్స్ వచ్చాయి. దాంతో చాలా ప్రాక్టీస్ చేసి .. ఆ విషయంలో సక్సెస్ అయ్యాను. నాకు కథలు రాసే అలవాటు ఉంది .. మంచి కథ రాసుకుని ఒక సినిమాకి దర్శకత్వం చేయాలనే కోరిక ఉంది. కాస్త అనుభవం వచ్చాక ఆ దిశగా ట్రై చేస్తాను" అని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News