ధ‌నుష్ త‌ర్వాత హాలీవుడ్ కి చ‌ర‌ణ్ ప‌య‌నం?

Update: 2022-07-18 04:05 GMT
చూస్తుండ‌గానే అంతా మారిపోతోంది. భారీ పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. దీనికి టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి స‌రికొత్త బాట‌లు ప‌రిచార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. బాహుబ‌లి-బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ ని క్రియేట్ చేయ‌డంలో జ‌క్క‌న్న స‌ఫ‌ల‌మ‌య్యారు. ఇక ఆర్.ఆర్.ఆర్ స్టాండార్డ్స్ కి హాలీవుడ్ లోనూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు టాప్ హాలీవుడ్ ద‌ర్శ‌కులు ఆర్.ఆర్.ఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇంకా ఎంద‌రో హాలీవుడ్ స్టార్లు ఈ సినిమా మేకింగ్ స్టైల్ కి  ఫిదా అయ్యారు.

ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కుతోంది. అత‌డిని హాలీవుడ్ స్టార్లు.. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు కీర్తించ‌డ‌మే కాకుండా హాలీవుడ్ లో న‌టించాల‌ని కూడా కోరుతున్నారు.  ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ 'డాక్టర్ స్ట్రేంజ్'- ది బ్లాక్ ఫోన్ సినిమాలతోనే ఎంతగానో ఆకట్టుకున్న  స్కాట్ డెరిక్సన్ RRR సినిమాను చూసి ఫిదా అయ్యాడు. ట్విట్టర్ లో ప్ర‌శంస‌లు కురిపించాడు.దీన‌ర్థం.. చ‌ర‌ణ్‌- తార‌క్ లాంటి స్టార్లు ఇప్పుడు హాలీవుడ్ ద‌ర్శ‌కుల దృష్టిలో ఉన్నార‌నే.

అందుకే ఆ దిశ‌గా చ‌ర‌ణ్- తార‌క్ లు ఆలోచిస్తే త్వ‌ర‌లోనే హాలీవుడ్ లో న‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ 'అవెంజ‌ర్స్' ఫేం ర‌స్సో బ్ర‌ద‌ర్స్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ వ‌రల్డ్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆ త‌ర్వాత హాలీవుడ్ కి వెళ్లే స్టార్ గా రామ్ చ‌ర‌ణ్..తార‌క్ లు రికార్డుల‌కెక్కాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ పై హాలీవుడ్ ఫేమ‌స్ ద‌ర్శ‌కుల దృష్టి ప‌డింది. ఆర్.ఆర్.ఆర్ లో బ్రిటీష్ స‌పోర్ట‌ర్ గా టిఫిక‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ గా అత‌డు న‌టించిన తీరు పాశ్చాత్య దేశాల్లో బాగా క‌నెక్ట‌య్యింది. అందుకే మునుముందు చ‌ర‌ణ్ ని హాలీవుడ్ భారీ మ‌ల్టీస్టారర్ల‌లో భాగం చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ భార‌తీయ న‌టీన‌టుల‌ను క‌లుపుకుని హాలీవుడ్ సినిమాలు తెర‌కెక్కితే భార‌తీయ మార్కెట్ నుంచి బాక్సాఫీస్ సంచ‌ల‌నాలు న‌మోదు కావ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు హాలీవుడ్ ద‌ర్శ‌కులు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి బాలీవుడ్ లో భారీ యాక్ష‌న్ హీరోలు త‌మ సినిమాల‌ను ప్ర‌పంచ దేశాల్లో విడుద‌ల చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నా కానీ హాలీవుడ్ లో న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు.

హాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ల‌కు ఏమాత్రం తీసిపోని స‌ల్మాన్- హృతిక్- టైగ‌ర్ ష్రాఫ్ లాంటి స్టార్లు కేవ‌లం హిందీ మార్కెట్ కే ప‌రిమిత‌మైపోయారు. దీనిని బ్రేక్ చేసేందుకు ఒక తెలుగు స్టార్ ప్ర‌య‌త్నిస్తే త‌ప్పు కాదు. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో గ్లోబ‌ల్ మార్కెట్లో స‌త్తా చాటే స్టార్ కి ఉండే బాక్సాఫీస్ గ్రిప్ వేరుగా ఉంటుంద‌ని ప్ర‌భాస్ నిరూపిస్తున్నాడు. బాహుబ‌లి స్టార్ గా ప్ర‌భాస్ కి ఆర్.ఆర్.ఆర్ స్టార్లుగా రామ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ ల‌కు హాలీవుడ్ లో ఫాలోయింగ్ పెరిగింది. అందుకే ప్ర‌భాస్ -చ‌ర‌ణ్- తార‌క్ లాంటి స్టార్లు ఆ దిశ‌గా ఆలోచిస్తే బావుంటుంద‌ని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.

భార‌తీయ సినిమా ప‌రిధి పెరిగింది. పాన్ వ‌ర‌ల్డ్ రేంజుకు ఎదుగుతోంది. ఇటీవ‌ల అమెరికా-బ్రిట‌న్- చైనా-జ‌పాన్- కొరియా- ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లాంటి చోట్లా మ‌న సినిమాకి ఆద‌ర‌ణ పెరుగుతోంది. బాలీవుడ్- టాలీవుడ్ స్టార్లకు ఆయా దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మునుప‌టితో పోలిస్తే ఓటీటీ వెల్లువ‌తో ప్ర‌పంచంలో మారుమూల ప్రాంతాల్లోనూ మ‌న స్టార్లు ప‌రిచ‌య‌మైపోతున్నారు. ఇది మార్కెట్ల పున‌రుత్థానానికి దారి తీస్తోంది. ఈ ట్రెండ్ ని ఒడిసిప‌డితే భారతీయ సినిమా స్థాయి అమాంతం హాలీవుడ్ ని ట‌చ్ చేస్తుందని ఆశించ‌డంలో త‌ప్పులేదు. తాజా ప‌రిణామంతో మ‌న‌ సినిమా స‌న్నివేశం ఎంత‌వ‌ర‌కూ వెళుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News