సందడిగా సాగుతున్న 'చెక్' ప్రీ రిలీజ్ ఈవెంట్

Update: 2021-02-21 14:39 GMT
నితిన్ ఈ ఏడాది మాంఛి దూకుడు చూపించడానికే రెడీ అవుతున్నాడు. క్రితం ఏడాది 'భీష్మ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నితిన్, ఈ ఏడాది 'చెక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నితిన్ జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్ అందాల సందడి చేయనుండగా, లాయర్ గా ఒక ముఖ్యమైన పాత్రలో రకుల్ కనిపించనుంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లకు తీసుకురానున్నారు.

ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ సాగే ఈ కథ 'చదరంగం'తో ముడిపడి ఉంటుందని అంటున్నారు. కథానాయకుడు .. ప్రతినాయకుడిపై వేసే ఎత్తుగడలకు ఈ చదరంగం ఆట ఉపయోగపడుతూ ఉంటుందట. ఎక్కువగా ఈ కథ అంతా కూడా జైలు చుట్టూ తిరగనుంది. మురళీశర్మ .. పోసాని .. సాయిచంద్ .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటోంది. హైదరాబాద్ .. మాదాపూర్ .. ఎన్ కన్వెన్షన్ లో ఈ వేడుక జరుగుతోంది. రాజమౌళి .. వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

నితిన్  అభిమానులతో పాటు రాజమౌళి - వరుణ్ తేజ్ ఫ్యాన్స్ భారీస్థాయిలో స్టేజ్ దగ్గరికి చేరుకున్నారు. అభిమానులతో అక్కడి వాతావరణమంతా కోలాహలంగా ఉంది. వైట్ డ్రెస్ లో తెల్ల కలువలా స్టేజ్ పైకి వస్తూనే శ్రీముఖి తన సందడిని మొదలు పెట్టేసింది. గతంలో వదిలిన టీజర్ ను మళ్లీ స్టేజ్ పై గల స్పెషల్ స్క్రీన్ పై ప్లే చేశారు. ఆ తరువాత గ్రూప్ డాన్సర్లతో స్టేజ్ దడదడలాడిపోయింది. ఇక ఇమ్మాన్యుయేల్ .. నూకరాజు కామెడీ స్కిట్స్ తో నవ్వించారు.

ప్రియా ప్రకాశ్ వారియర్ ఎరుపురంగు డ్రెస్ లో తళుక్కున మెరిసింది. అందమైన ఆమె నవ్వు .. ఆమె టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో ఉన్న ఒక్క పాటను వరంగల్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో లాంచ్ చేయించారు. బ్లాక్ డ్రెస్ లో హ్యాండ్ సమ్ లుక్ తో నితిన్ ఎంట్రీ ఇవ్వడంతో, ఈలలు .. గోలలతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారిపోయింది.
Tags:    

Similar News